
న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగో వేవ్ రానుందా అనే భయాలు ఈ కేసుల పెరుగుదలను చూస్తే కలుగుతున్నాయి. దేశంలో కొత్త కేసులు ఏకంగా 41 శాతం పెరిగాయి. క్రితం రోజు కంటే నిన్న 41 శాతం అధికంగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 5,233 కొత్త కేసులు నమోదైనట్టు ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మన దేశంలో కరోనా కేసులు 5000 మార్క్ మళ్లీ మూడు నెలల తర్వాత అంటే 93 రోజుల తర్వాత దాటింది. 5,233 కొత్త కేసులతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 28,857కు పెరిగాయి. ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రిపోర్ట్ అయ్యాయి. మహారాష్ట్రంలో ఒక్క రోజులోనే 81 శాతం కేసుల పెరుగుదల కనిపించింది. ఫిబ్రవరి 18వ తేదీ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం మహారాష్ట్రలో కొత్తగా 1,881 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో ఒక బీఏ.5 వేరియంట్ కేసు కూడా నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనే 1,242 కేసులు నమోదు కావడం గమనార్హం. సోమవారం నాటి కేసులతో పరిశీలిస్తే రెట్టింపుగా నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కొత్తగా ఏడుగురు కరోనా వైరస్ పేషెంట్లు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,715కి చేరాయి.
కరోనా మహమ్మారి తొలిసారి మన దేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మూడు వేవ్‌లు వచ్చాయి. ఈ వేవ్‌లు ప్రతిసారి నాలుగైదు నెలల గ్యాబ్ తర్వాత పీక్‌కు చేరుతూ ఉండటాన్ని మనం చూశాం. థర్డ్ వేవ్ తర్వాత కేసులు మళ్లీ తగ్గాయి. కరోనా కేసులు చాలా వరకు తగ్గిపోయాయి. కానీ, మళ్లీ నెలల వ్యవధితో కేసులు పెరుగుతుండటంపై ఆందోళనలు వెలువడుతున్నాయి. ఈ కేసుల పెరుగుదల ఫోర్త్ వేవ్‌కు సంకేతమా? అనే కోణంలోనూ భయాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తం కేసులు మన దేశంలో 4.31 కోట్లకు చేరాయి. 2020 ఆగస్టు 7న తొలిసారి మన దేశంలో కరోనా వైరస్ కేసులు 20 లక్షలను దాటాయి. అదే నెల 23న 30 లక్షలను దాటాయి. సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్క్‌ను దాటాయి.
సెప్టెంబర్ 28న కరోనా కేసులు 60 లక్షల సంఖ్యను దాటాయి. అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కరోనా కేసులు ఒక కోటిని క్రాస్ అయ్యాయి.
కరోనా కేసులు గతేడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల సంఖ్యను దాటాయి.