భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేల మార్కు దాటింది. కాగా, లాక్ డౌన్ ప్రభుత్వం వలస కూలీలకు ఊరట ఇచ్చింది.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో కొత్తగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరుకుంది. కొత్తగా గత 24 గంటల్లో 67 మంది మరణించారు. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 1,074క చేరుకుంది.
ఇప్పటి వరకు కోవిడ్ -19 రోగులు చికిత్స పొంది 8,325 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రికవరీ రేటు 25.18 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది.
మహారాష్ట్రలోని మాలెగావ్ లో బుధవారం రాత్రి కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాలెగావ్ లో 253కు చేరుకుంది. కరోనా వైరస్ సోకినవారిలో 3 నెలల బేబీ కూడా ఉంది. ఆరుగురు పోలీసులు ఉన్నారు.
ఇదిలావుంటే, వలస కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులకు కూడా ఊరట లభించింది. వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇరు రాష్ట్రాలు సంప్రదించుకుని వారిని అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది.
స్వస్థలాలకు చేరుకోవడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. సొంత రాష్ట్రానికి చేరుకున్న తర్వాత వారిని హోం క్వారంటైన్ లో పెట్టాలని కూడా ఆదేశించింది. ఆరోగ్య సేత యాప్ ద్వారా అందరినీ ట్రాక్ చేయాలని ఆదేశించింది.
వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారిని ప్రత్యేక బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించాలని కూడా సూచించింది. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని కూడా సూచించింది.