దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో పెద్ద యెత్తున 5 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ మూడో విడత ముగుస్తున్న వేళ ఇది ఆందోళన కలిగించే విషయమే.
న్యూఢిల్లీ: భారతదేశంలో గడిచిన 24 గంటల్లో పెద్ద యెత్తున కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్కు దాటింది. గత 24 గంటల్లో ఒక్క రోజులో 4987 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,927కు చేరుకుంది.
గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరో 124 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,872కు చేరుకుంది. ఇప్పటి వరకు 34,108 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 53,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మూడో విడత లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ కేసులు తగ్గకపోగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో ఐదు వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. శనివారంనాడు కరోనా వైరస్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. ఒక్క రోజులో 1,606 కేసులు నమోదయ్యాయి. శనివారంనాటి లెక్కల ప్రకారం... ఒక్క రోజులో 67 మరణాలు సంభవించాయి.
ముంబై నగరం కరోనా వైరస్ తో అట్టుడుకుతోంది. శనివారంనాటి లెక్కల ప్రకారం.. ముంబైలో కొత్త 884 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 18,555కు చేరుకుంది. కొత్తగా 41 మంది మరణించారు. దీంతో ముంబైలో మరణాల సంఖ్య 696కు చేరుకుంది.