సీఎస్‌, డిజిపిలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమావేశం... కీలక ఆదేశాలు జారీ

By Arun Kumar PFirst Published Mar 26, 2020, 4:24 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి  విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్రాల సీఎస్, డిజిపిలతో సమావేశమయ్యారు. 

 

న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ  క్రమంలో కరోనా నివారణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలకు కేంద్ర కేబినెట్  కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. 

కోవిద్-19పై గురువారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రాజీవ్ వీడియో సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏవిధంగా అమలవుతుందో అన్ని రాష్ట్రాల సిఎస్ లు,డిజీపి లను అడిగి తెలుసుకున్నారు.  మరో మూడు వారాల పాటు ఈ లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

నిత్యావసర వస్తువులు సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. వివిధ నిత్యావసర సరుకులు రవాణా చేసే లారీలు, ట్రక్కులు, గూడ్స్ వాహనాలు అవి చేరుకోవాల్సిన నిర్దేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా చూడాలని ఆదేశించారు.  ఇప్పటికే వివిధ ఆంతర్రాష్ట్ర, ఆంతర్ జిల్లాల చెక్ పోస్టుల వద్ద ఆగిపోయిన వాహనాలు వెంటనే వెళ్ళేలా చూడాలని స్పష్టం చేశారు.

కేంద్ర కేబినెట్ కార్యదర్శితో జరిగిన ఈ వీడియో సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, ఆర్అండ్‌బి,హోం శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు, కుమార్ విశ్వజిత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

click me!