మనందరం కూడా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ని చూసి ఎప్పుడో ఒకప్పుడు పొరబడి ఉంటాము. ఈ ఫేక్ న్యూస్ ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం. సమాజంలో ఉన్న శాంతియుత వాతావరణానికి కూడా ఇది భంగం కలిగించే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ ఫేక్ న్యూస్ బారిన మీరు కూడా పడొద్దంటే... ఈ మధ్యకాలంలో బాగా ప్[ఓపులర్ అయినా ఫేక్ న్యూస్ ని ఒకసారి చూద్దాం.
సోషల్ మీడియా ఫేక్ న్యూస్ కి అడ్డాగా మారిపోతుంది. ఈ కరోనా వైరస్ కష్టకాలంలో వాస్తవ సమాచారం ప్రజలకు చేరుకోవడంలో ఆలస్యం, అవుతుందేమో కానీ... ఫేక్ న్యూస్ మాత్రం చిటికలో చేరుకుంటుంది.
మనందరం కూడా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ని చూసి ఎప్పుడో ఒకప్పుడు పొరబడి ఉంటాము. ఈ ఫేక్ న్యూస్ ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం. సమాజంలో ఉన్న శాంతియుత వాతావరణానికి కూడా ఇది భంగం కలిగించే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ ఫేక్ న్యూస్ బారిన మీరు కూడా పడొద్దంటే... ఈ మధ్యకాలంలో బాగా ప్[ఓపులర్ అయినా ఫేక్ న్యూస్ ని ఒకసారి చూద్దాం.
1.‘కరోనా టీకా వేయించుకున్న మొదటి మహిళ 32 ఏళ్ల ఎలీసా గ్రనటో మృతి’ అని ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది. సోషల్ మీడియాలో అదే వార్తను చాలామంది షేర్ చేస్తున్నారు. నిజనిర్ధారణలో అది తప్పని తేలింది.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కరోనా టీకా పరిశోధనలో ఎలీసా గ్రనటో వాలంటీర్ గా మొదటగా టీకా తీసుకుంది. ఎలీసా గ్రనటో చనిపోలేదని, ఆరోగ్యంగానే ఉందని, ఆమెతో మాట్లాడిన బీబీసీ జర్నలిస్ట్ ఒకరు ట్వీట్ చేశారు. ‘
నేను బ్రతికే ఉన్నా’ అని చెప్తూ ఎలీసా గ్రనటో తీసిన వీడియోని కూడా పంచుకున్నారు. యూకే ‘హెల్త్ మరియు సోషల్ కేర్ డిపార్ట్మెంట్’ వారు కూడా అది ఒక ఫేక్ వార్త అని ట్వీట్ చేసారు.
2. కరోనా వైరస్ సహజంగా పుట్టింది కాదని, చైనాయే దీనిని ప్రయోగశాలలో సృష్టించిందని జపాన్ కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, వైద్యశాస్త్ర ఆచార్యుడు డాక్టర్ తసుకు హోంజో అన్నట్లుగా ఒక మెసేజ్ సోషల్ మీడియాలో తిరుగుతున్నది.
నిజనిర్ధారణలో డా.తసుకు హోంజో అటువంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదని తేలింది. కోవిడ్-19 వ్యాధి ప్రబలినప్పటినుండి కరోనా వైరస్ వుహన్ లోని రీసెర్చ్ ల్యాబులో తయారుచేసారని చాలా వాదనలు వినిపించాయి. అయితే, ఆ వాదనలు తప్పని ప్రపంచంలోని అనేక నిజనిర్ధారణ సంస్థలు ఇప్పటికే విశ్లేషణలు చేశాయి.
3. సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీ నారాయణ యొక్క వాయిస్ మెసేజ్ అంటూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చలామణీ అవుతోంది. ఆ ఆడియో క్లిప్ లో మాట్లాడే వ్యక్తి వచ్చే రెండు నెలలు భారతదేశం పూర్తి లాక్ డౌన్ లో ఉండబోతున్నదని, అందువల్ల ఇంటికి సరిపడా ఆహారం, మందులు మరియు నగదు అందుబాటులో ఉంచుకోవాలని చెప్తాడు.
లాక్ డౌన్ రెండు నెలలు ఉండాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారత ప్రభుత్వానికి సూచించిందని ఆడియో క్లిప్ లోని వ్యక్తి అంటాడు. తన పేరిట చలామణీ అవుతున్న ఆడియో క్లిప్ లో మాట్లాడింది తాను కాదని లక్ష్మీనారాయణ ఒక యూట్యూబ్ వీడియో ద్వారా ఖండించారు.
4. ఫేస్బుక్ లో కర్నూలు MLA హఫీజ్ ఖాన్ తన మతపెద్దకు నర్సుతో కాళ్ళు మొక్కిస్తున్నాడనీ, ఆ సంఘటన విశ్వభారతి మెడికల్ కాలేజ్ లో జరిగిందనీ చెప్తూ ఒక ఫోటో షేర్ చేస్తున్నారు. కానీ, నిజ నిర్ధారణలో తేలిందేమిటంటే ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లోని వైద్య సదుపాయాలను పరిశీలించడానికి వెళ్ళారు.
అక్కడున్న సిబ్బందితో మాట్లాడుతున్న సమయంలో ఓ ముస్లిం వ్యక్తి కాలికి గేట్ తగిలి రక్తస్రావమైంది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న ఓ నర్సు ఆ వ్యక్తి గాయానికి చికిత్స చేసి కట్టు కట్టింది. పైన చెప్పిన ఫోటో ఆ సందర్భంలో తీసినది. ఆ ఘటనకి సంబంధించిన వీడియోలో వ్యక్తి కాలికి రక్తం కారుతుండటం చూడవచ్చు.
5. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, COVID-19తో మరణించిన వారి శరీరాలను కొన్ని దేశాలు సముద్రాలలోకి విసిరేస్తున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు.
కానీ, ఆ వీడియో ఐదేళ్ల ముందటిదని నిజ నిర్ధారణలో తేలింది. ఆగస్టు 2014లో ఆఫ్రికాకు చెందిన వలసపోతున్న వారి ఒక పడవ యూరప్ కు వెళ్లే దారిలో లిబియా తీరంలో మునిగిపోయింది. ఆ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు లిబియాలోని బీచ్ ఒడ్డుకు కొట్టుకురావడం సంబంధిత వీడియో చూపిస్తున్నది.
6. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ లోని అక్బర్‌పూర్ బ్లాక్ లో ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారనే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది.
కానీ ఆ వీడియో వీడియో బీహార్ లోని అక్బర్‌పూర్‌కు చెందినదని, ఇంటర్నెట్ లో కనీసం 2019 ఏప్రిల్ నుండి ఉన్నదని విశ్లేషణలో తేలింది. ఆ వీడియో లాక్ డౌన్ కాలానికి ముందు తీసినది, కాబట్టి ప్రస్తుతం దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ కి సంబంధించింది కాదు.
7. ఇజ్రాయెల్ కరోనావైరస్ నివారణకు ఔషధం కనుక్కున్నదని, అందుకే ఆ దేశంలో కోవిడ్-19 వ్యాధితో ఎవరూ మరణించలేదని చెబుతూ ఒక మెసేజ్ సోషల్ మీడియా లో ప్రచారంలో ఉంది. వేడి నీటిలో నిమ్మకాయ మరియు బేకింగ్ సోడాని కలిపి టీ లాగా తాగితే కరోనావైరస్ నివారించవచ్చని ఆ సందేశం చెబుతున్నది.
నిజనిర్ధారణలో 20 ఏప్రిల్, 2020 వరకు ఇజ్రాయిల్లో 171 మరణాలు నమోదు అయ్యాయని తేలింది. అంతేకాక, నిమ్మకాయ మరియు బేకింగ్ సోడా మిశ్రమం కరోనావైరస్ ని నివారిస్తుంది అన్న వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు.
8. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విలాసవంతమైన దుస్తులు వేసుకుని ఒక ఆసుపత్రిని సందర్శించారన్న వాదనతో ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అయితే ఆ ఫోటో సుమారు రెండు సంవత్సరాల కిందటిదని నిజనిర్ధారణలో తేలింది. అది ప్రధాని 2017 సంవత్సరంలో శ్రీలంకలోని Dickoya Glengairan అనే ఆసుపత్రిని ప్రారంభిస్తున్నప్పటిది.
సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదు. ఇతరులతో పంచుకునే ముందు తప్పనిసరిగా రూఢీ చేసుకోండి. అసత్యాలు ప్రచారం చేస్తే సంబంధిత చట్టాల ప్రకారం శిక్షార్హులవుతారు. ఏదైనా వార్తను ఫేక్ ఆ కాదా అని తెలుసుకోవాలంటే... మీరు మాకు పంపించవచ్చు. మేము అందులోని నిజానిజాలను వెరిఫై చేసి మీకు సమాధానం ఇస్తాము.