covid 19 deaths report: దేశంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. భారత్ లో కోవిడ్-19 ఉప్పెన కారణంగా 5.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
Coronavirus disease: చైనా, దక్షిణ కొరియా సహా పలు యూరప్ దేశాల్లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. భారత్ లోనూ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రభావం పెరుగుతున్నదని ప్రస్తుతం నమోదవుతున్న కేసుల గణాంకాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరగడం.. కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌లను జన్యు శాస్త్రవేత్తలు వేగంగా గుర్తించడం కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదనడానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని వైద్య బృందాలు, అధికార యంత్రాంగాలు పేర్కొంటున్నాయి.
భారత్ లో కరోనా మహమ్మారి ఉప్పెన కారణంగా 5.2 లక్షల మందికి పైగా మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) నివేదిక ప్రకారం, దేశంలో కోవిడ్ కారణంగా 5.2 లక్షల మందికి పైగా మరణించారు. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 3,275 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,30,91,393 కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 19,719 కు పెరిగాయి. ఇదే సమయంలో కరోనా మహమ్మారి నుచి 3,010 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా రికవరీల సంఖ్య 4,25,47,699కు చేరుకుంది. అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్ తో పోరాడుతూ.. 55 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు సంఖ్య 5,23,975కు పెరిగింది.
undefined
భారత్ కరోనా వైరస్ కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. మాస్కులను తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19తో 6,269,587 మంది మృతి
ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొత్త వేరియంట్లు పుట్టుకురావడమేనని వైద్య నిపుణులు, పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, న్యూజిలాండ్, చైనా సహా పలు యూరప్ దేశాల్లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 6,269,587 మంది కరోనాతో మరణించారు. మొత్తం 515,354,713 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, రష్యా, సౌత్ కొరియా, ఇటలీ, టర్కీ, స్పెయిన్, వియత్నాంలు ఉన్నాయి.