మహారాష్ట్రకు మరో ఉపద్రవం: నిండుకున్న వ్యాక్సిన్లు.. మరో మూడు రోజులు దాటితే..!!

By Siva KodatiFirst Published Apr 7, 2021, 4:50 PM IST
Highlights

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. ముఖ్యంగా దేశంలో తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో.. సగం ఇక్కడి నుంచే కావడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఇదే సమయంలో మహారాష్ట్ర సర్కార్‌కు అనుకోని ఆపద వచ్చి పడింది. 

కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా ఇక్కడ సజావుగా సాగడం లేదట. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత నెలకొన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే స్వయంగా అంగీకరించడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత గురించి కేంద్రానికి తెలియజేశామని రాజేశ్ చెప్పారు. 

రాష్ట్రంలో వున్న వ్యాక్సిన్లు మరో మూడు రోజులకు మాత్రమే సరిపోతాయని.. మరిన్ని డోసులు పంపించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. చాలా టీకా కేంద్రాల్లో తగినన్ని డోసులు లేకపోవడంతో వాటిని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ దృష్టికి తీసుకొచ్చారు రాజేశ్.

వ్యాక్సిన్లు లేకపోవడంతో అక్కడికి వచ్చిన ప్రజలను ఆరోగ్య సిబ్బంది తిప్పిపంపుతున్నారని ఆయన వివరించారు. కేంద్రం వీలైనంత త్వరలో టీకా డోసులు పంపించకపోతే.. రెండో డోసు ఇవ్వడం కష్టతరంగా మారుతుందని ముంబయి నగర మేయర్‌ కిషోరి పెడ్నేకర్‌ చెప్పారు.  

ఇక కేంద్రం ఇప్పటి వరకు కోటి 6 లక్షల డోసులను మహారాష్ట్రకు అందించింది. వాటిలో ఇప్పటికే 88 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరో 3 శాతం డోసులు నిరుపయోగం కింద పోయాయని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.

కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి కేంద్రీకరించింది. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో రోజుకు నాలుగు లక్షల మందికిపైగా టీకాలు అందిస్తోంది.

click me!