కరోనా కష్టాలు: తినడానికి తిండి లేక కన్న బిడ్డను అమ్మేసిన వలస కూలీ

By Siva KodatiFirst Published Jul 24, 2020, 10:29 PM IST
Highlights

తినడానికి తిండిలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఓ వలస కూలీ ఏ తండ్రి చేయని పనిచేశాడు. తన నాలుగు నెలల కుమార్తెను 45,000 రూపాయలకు విక్రయించాడు

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు తలక్రిందులయ్యాయి. ఉపాధి లేకపోవడంతో ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు.  దేశంలో లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. కడుపు నింపుకోవడం వారు చేయని ప్రయత్నం లేదు.

ఈ క్రమంలో తినడానికి తిండిలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఓ వలస కూలీ ఏ తండ్రి చేయని పనిచేశాడు. తన నాలుగు నెలల కుమార్తెను 45,000 రూపాయలకు విక్రయించాడు.

Also Read:అప్పడాలతో కరోనా కట్టడంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు: కేసు పెట్టాలంటూ కాంగ్రెస్ డిమాండ్

వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని కొక్రాజార్ జిల్లాలోని అటవీ గ్రామమైన ధంటోలా మాండరియాలో నివసించచే దీపక్ బ్రహ్మ గుజరాత్‌లో కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాడు.

ఈ నేపథ్యంలో కరోనాతో లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి లేక స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో పనిలేక తీవ్ర పేదరికంలో ఉన్న సమయంలో దీపక్ భార్య రెండో సంతానంగా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 

Also Read:30 సెకండ్లలో కరోనా టెస్ట్, ఇజ్రాయెల్ తో చేయి కలిపిన భారత్

అప్పటికే వారికి ఏడాది వయసున్న కూతురుంది. రెండోసారి ఆడపిల్ల పుట్టడం.. చేతిలో పైసా లేకపోవడంతో నాలుగు నెలల పసికందును విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజున భార్యకు తెలియకుండా పాపను రూ.45 వేలకు విక్రయించాడు.

అయితే బిడ్డ కనిపించకుండా భార్య.. దీపక్‌ను ప్రశ్నించింది. దీంతో వెంటనే గ్రామస్తుల సాయంతో భార్య కొచ్చుగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బిడ్డను కొన్న మహిళ నుంచి శిశువును విడిపించి తల్లికి అప్పగించారు.

అనంతరం బిడ్డను కొన్న మహిళను కూడా అరెస్ట్ చేశారు. అయితే తమకు సంతానం లేకపోవడంతోనే శిశువును కొన్నామని వారు పోలీసుల విచారణలో తెలిపారు. మరోవైపు శిశువును రక్షించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు నేడాన్ ఫౌండేషన్ ఛైర్మన్ దిగంబర్ నార్జరీ.

లాక్‌డౌన్ కారణంగా పేద ప్రజలకు ఉపాధి లేకుండా పోయిదని.. అటవీ గ్రామాల్లో నివసించే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 

click me!