
న్యూఢిల్లీ: అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కారణంగా మన దేశంలో కరోనా కేసులు(Coronavirus Cases) మరోసారి భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో పీక్‌కు వెళ్లి మళ్లీ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తున్నది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నా.. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం కరోనా వివరాలపై బులెటిన్(Health Ministry Corona Bulletin) విడుదల చేసింది. దీని ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. 24 గంటల్లో 2,81,109 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపింది. కాగా, 1,733 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న టాప్ స్టేట్స్‌లలో కేరళ(51,887 కేసులు), తమిళనాడు(16,096 కేసులు), మహారాష్ట్ర(14,372 కేసులు), కర్ణాటక(14,366 కేసులు), గుజరాత్(8,338 కేసులు)లు ఉన్నాయి.
ఒమిక్రాన్ మూలంగా మన దేశంలో మరోసారి కేసులు పరాకాష్టకు చేరిన సంగతి తెలిసిందే. గత నెలలో కేసులు ఒకానొక దశలో మూడున్నర లక్షలకు చేరువ అయ్యాయి. జనవరి 21వ తేదీన 3.47 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్‌లో పీక్ 3.47 లక్షల కేసులే. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా, 1.61 లక్షలకు తగ్గాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతున్నది. తాజాగా నమోదైన మరణాలు ఈ ఏడాదిలోనే అత్యధికం. థర్డ్ వేవ్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. వారం క్రితం కరోనా మరణాల సంఖ్య 500 నుంచి 600 మధ్యలో ఉన్నది. 28వ తేదీన కాస్త పెరిగి 627కు పెరిగాయి. ఆ తర్వాత పెరుగుతూ మొన్న(నిన్నటి బులెటిన్‌లో) వెయ్యి మార్క్‌ను క్రాస్ అయ్యాయి. తాజాగా, ఈ మరణాలు మరింత పెరిగి రెండు వేలకు చేరువగా వెళ్లడం గమనార్హం.
ఇవాళ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, తాజాగా చోటుచేసుకున్న 1,733 మరణాలతో దేశంలో మొత్తం మరణాలు ఐదు లక్షలకు చేరువయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 4,97,975కి పెరిగాయి. 1,61,386 రికవరీలతో మొత్తం రికవరీల సంఖ్య 3,95.11,307కి చేరాయి. దీంతో కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతం నుంచి 9.26 శాతానికి పడిపోయింది. కాగా, వారపు పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉన్నది.
ఇదిలా ఉండగా కరోనా టీకా పంపిణీ కూడా శరవేగంగా సాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 57,42,659 డోసులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 167.21 కోట్ల టీకాలను పంపిణీ చేశారు. దేశంలోని సుమారు 75 శాతం వయోజనులు రెండు డోసలు టీకాలను తీసుకున్నారు.
మన దేశంలో కరోనా కేసులు తొలిసారిగా 2020 డిసెంబర్ 19న కోటి మార్క్‌ను దాటింది. ఆ తర్వాత గతేడాది మే 4న రెండు కోట్ల మార్క్‌ను, జూన్ 23న మూడు కోట్ల మార్క్‌ను దాటేసింది.ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 4,16,30,885కు చేరింది.