UP Elections 2022: అఖిలేశ్ యాదవ్‌పై పోటీకి అభ్యర్థిని బరిలోకి దించని కాంగ్రెస్

Published : Feb 01, 2022, 08:16 PM IST
UP Elections 2022: అఖిలేశ్ యాదవ్‌పై పోటీకి అభ్యర్థిని బరిలోకి దించని కాంగ్రెస్

సారాంశం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో కీలక పరిణామం ముందుకు వచ్చింది. బీజేపీతో బలంగా ఢీకొంటున్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇది కేవలం మర్యాదపూర్వక నిర్ణయం అని వివరించింది. అఖిలేశ్ యాదవ్ కర్హల్ నుంచి పోటీ చేస్తున్నారు. అఖిలేశ్ యాదవ్‌పై బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బగేల్ పోటీ చేస్తున్నారు. కాగా, ఈ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Uttar Pradesh Assembly Elections 2022) వేళ కొత్త కొత్త రాజకీయ పరిణామాలను చూస్తున్నాం. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party), బీజేపీ(BJP) మధ్య చోటుచేసుకుంటున్న హోరాహోరీ పోరు గంభీరంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ (Congress), సమాజ్‌వాదీ పార్టీల మధ్య దోబూచులాట వెలుగులోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, మళ్లీ విడిగా పోటీ చేయడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. అయితే, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారీగా ఒక ఒప్పందం కుదిరినట్టు మాత్రం తెలుస్తున్నది. ఎందుకంటే అమేథి, రాయ్‌బరేలీల నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పోటీకి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించలేదు. ఇలా ఈ రెండు పార్టీలు అంతో ఇంతో అప్పుడప్పుడు సానుకూలంగా మసులుకుంటూ ఉన్నాయి. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ సమాజ్‌వాదీ పార్టీకి తన రుణాన్ని సమర్పించుకుంటున్నదేమో.. అఖిలేశ్ యాదవ్‌ (Akhilesh Yadav) పై పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిని దించడం లేదు.

ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కానీ, ఆ కూటమి దారుణంగా పరాజయం పాలైంది. దీంతో ఈ సారి ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి. అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా కర్హల్ నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎంపీగా ఉన్న మెయిన్‌పురి పరిధిలోనే ఈ సీటు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సీటు నుంచి అఖిలేశ్ యాదవ్‌పై పోటీగా తమ అభ్యర్థిని బరిలోకి దింపడం లేదు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అని పార్టీ తెలిపింది. అఖిలేశ్ యాదవ్‌తోపాటు ఆయన బంధువు శివపాల్ యాదవ్‌పై కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీగా నిలబెట్టడం లేదు. 

కర్హల్‌లో అఖిలేశ్ యాదవ్‌.. బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బగేల్‌తో తలపడనున్నారు. ఎస్పీ సింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని అఖిలేశ్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీతోనే ప్రారంభించారు. ఎస్పీ సింగ్ బగేల్ తన నామినేషన్ దాఖలు చేస్తూ మెయిన్‌పురి ఎవ్వరి కంచుకోట కాదని, తాను ఇక్కడ అన్ని శక్తియుక్తులతో పోరాడుతానని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా పేరున్న కన్నౌజ్, ఫిరోజాబాద్, ఎటావాలలో ఆ పార్టీ ఓడిపోవడాన్ని చూశానని అన్నారు.

శివపాల్ యాదవ్ కుటుంబ కలహాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీని వీడాడు. ప్రత్యేకంగా ఓ రాజకీయ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు అఖిలేశ్ యాదవ్‌తో చేతులు కలిపాడు. అఖిలేశ్ యాదవ్ కుటుంబానికి కంచుకోటగా భావించే ఎటావాలోని జశ్వంత్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఇద్దరు నేతలపై పోటీగా దళిత అభ్యర్థులను బరిలోకి దించుతానని వెల్లడించారు. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే నెల 20వ తేదీన మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu