Odisha Train Tragedy: లోకో పైలట్ స్టేట్‌మెంట్ ఇదే.. ట్రైన్ స్పీడ్, సిగ్నల్స్ పై స్పష్టత

By Mahesh KFirst Published Jun 5, 2023, 7:54 PM IST
Highlights

ఒడిశా ట్రైన్ ప్రమాద ఘటన చుట్టూ అనేక సందేహాలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. ఆయన స్టేట్‌మెంట్ కీలకంగా మారింది. ఆయన రెండు విషయాలను స్పష్టం చేశారు.
 

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో యావత్ ప్రపంచమే ఖంగుతిన్నది. ఈ ఘటనలో సుమారు 280 మంది మరణించగా.. ఇంచుమించు వేయి మంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం చుట్టూ అనేక అనుమానాలు అల్లుకున్నాయి. చాలా మంది ఇప్పటికీ అనేక ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పై వేలు చూపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ గుణానిధి మొహంతీ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లభించింది. ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సోమవారం వారు ఈ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ (డ్రైవర్) గుణానిధి మొహంతి తాము లూప్‌లోకి ఎంటర్ అయినప్పుడు రెడ్ సిగ్నల్ లేదని, గ్రీన్ సిగ్నలే ఉన్నదని స్పష్టం చేశారు. అలాగే, ప్రమాద సమయంలోనూ ట్రైన్ అనుమతించిన వేగానికి లోబడే ఉన్నదని వివరించారు. లోకో పైలట్ గుణానిధి మొహంతి, అసిస్టెంట్ లోకో పైలట్ హజారీ బెహెరాలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం భువనేశ్వర్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

లోకో పైలట్ స్టేట్‌మెంట్‌‌ను సమర్థిస్తూ రైల్వే బోర్డు మెంబర్ ఆఫ్ ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ జయ వర్మ సింహా మాట్లాడారు. రైల్వే సేఫ్టీ గురించిన అనేక సంశయాలను ఆయన తొలగించారు. 

Also Read: ‘ఈ రహస్యం నన్ను పీక్కుతింటున్నది’.. 15 ఏళ్ల కిందటి మర్డర్ కేసులో నేరాన్ని ఏడుస్తూ అంగీకరించిన నిందితుడు

డ్రైవర్‌తో మాట్లాడి అప్పుడు సిగ్నల్ గ్రీన్ ఉన్నదని ధ్రువీకరించామని చెప్పారు. తమ సిబ్బంది పని పట్ల నిబద్ధతో ఉంటారని వివరించారు. లోకో పైలట్.. సిగ్నల్ రెడ్ ఉన్నప్పుడు ట్రైన్‌ పాస్ చేయలేదని, అలాగే, ఓవర్ స్పీడ్‌తోనూ నడపలేదని అన్నారు. 

మరొక విషయం ఏమిటంటే.. ప్రతి లోకోలో ఒక స్పీడోమీటర్ ఉంటుందని, స్పీడ్‌ను రికార్డు చేసే చార్ట్ కూడా ఉంటుందని ఆయన వివరించారు. ఇక్కడ స్పీడోమీటర్ గ్రాఫ్ చూస్తే ట్రైన్ అనుమతించిన వేగానికి లోపలే ఉన్నదని తెలిపారు. అది హై స్పీడ్ సెక్షన్ అని, కాబట్టి, అక్కడ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ట్రన్ ప్రయాణించవచ్చునని, అప్పుడు ఈ ట్రైన్ 128 కిలోమీటర్ల వేగంతో వెళ్లుతున్నదని చెప్పారు.

లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌లు చికిత్స పొందుతున్నారని సౌత్ ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో ఆదిత్య చౌదరి తెలిపారు. రైల్వే సెక్యూరిటీ అత్యున్నత కమిషనర్ దర్యాప్తు సాగుతున్నదని చెప్పారు.

వీరిద్దరి ఆరోగ్యం నిలకడ సాధించిన తర్వాత స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తారని కొన్ని వర్గాలు వివరించాయి.

click me!