గంజాయి తోట గుర్తించి పరిశీలించిన పోలీసు.. అధికారిపై దాడి చేసిన 40 మంది గంజాయి సాగుదారులు

By Mahesh KFirst Published Sep 25, 2022, 2:11 PM IST
Highlights

మహారాష్ట్ర కర్ణాటక బార్డర్‌లోని ఓ గ్రామంలో పెద్ద మొత్తంలో గంజాయి పండిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. ఆ గంజాయి తోటలను పరిశీలించారు. ఇంతలోనే గంజాయి సాగు చేస్తున్న దుండగులు పోలీసులపై దాడులు చేశారు.
 

న్యూఢిల్లీ: ఓ పోలీసు అధికారి కొన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించుకుని కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో గంజాయిని సాగు చేస్తున్నారని కనుక్కున్నారు. ఆ గంజాయి సాగును బట్టబయలు చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో స్పాట్‌కు వెళ్లి.. గంజాయి తోటలోకి దిగాడు. తోటను పరిశీలించాడు. పోలీసులు పరిశీలిస్తున్నట్టు నిందితులు చూశారు. కర్ణాటక సరిహద్దు ఆవల మహారాష్ట్ర పరిధిలోకి వచ్చే 40 మంది గంజాయి సాగుదారులు పోలీసులను టార్గెట్ చేసుకున్నారు. వెంటనే ఆయనపై దాడి చేసి పారిపోయారు.

కలాబురగి పోలీసు స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్‌‌స్పెక్టర్ శ్రీమంత్ ఇలాల్ కొన్ని వర్గాల నుంచి గంజాయి సాగు జరుగుతున్నట్టు సమాచారం తెలుసుకున్నాడు. నేరపూరిత చరిత్ర గలవారు ఈ సాగులో బిజీగా ఉన్నట్టు సమాచారం సేకరించాడు. మహరాష్ట్ర పరిధిలోనే తరూరీ గ్రామం కాలబురగి జిల్లా నుంచి 85 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఇక్కడ కొందరు నేరస్తులు, దుండగులు గంజాయి సాగు చేస్తున్నారు. 

దీంతో ఈ కేసు ఛేదించాలని పోలీసుల బృందం రాత్రి 8. 30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుంది. ఆ ప్రాంతంలో పెరుగుతున్న గంజాయి మొక్కల వివరాలను ఆ టీమ్ సేకరించింది. ఇంతలో గంజాయి పెంచుతున్న కొందరు వేగంగా పరుగెత్తుకుని వచ్చి పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారి గన్ తీసి గాలిలో కాల్పులు జరపాలని ప్రయత్నించాడు. కానీ, అది కూడా సాధ్యపడలేదు. 

కాలబురగి ఎస్పీ ఇషా పంత్ మాట్లాడుతూ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీమంత్ ఇలాల్ తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ముఖం, ఛాతి, కడుపులోనూ గాయాలు అయ్యాయని వివరించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆయన పరిస్థితి మాత్రం క్రిటికల్‌గానే ఉన్నదని తెలిపారు. 

దుండగులు  వేగంగా దూసుకుచ్చి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఆ పోలీసు టీమ్ సభ్యులు కొందరు తప్పించుకోగా.. మరికొందరు దాడులకు గురయ్యారు. పోలీసులు కర్ణాటక వైపు గల గంజాయి తోటల్లో నడుస్తుంటే ఆకస్మికంగా మహారాష్ట్ర వైపు గంజాయి తోటల నుంచి పలువురు దాడి చేశారు. 

click me!