క్రిస్మస్ వేడుకల సందర్భంగా మతమార్పిడులు జరగకూడదు - అధికారులకు యూపీ సీఎం యోగి ఆదేశాలు

By team teluguFirst Published Dec 24, 2022, 10:55 AM IST
Highlights

క్రిస్మస్ వేడుకల సందర్భంగా మతమార్పిడులు జరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శాంతి భద్రతల మధ్య పండగ జరుపుకోవాలని సూచించారు. 

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యూపీలోనూ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయితే రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు శాంతి భద్రతల మధ్య ఘనంగా జరగాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.  కానీ ఏ జిల్లాలోనూ మత మార్పిడులు జరగకూడదని ఆయన అడ్మినిస్ట్రేటివ్, పోలీసులు అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. 

పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో 9 బిల్లుల‌కు ఆమోదం.. స‌మ‌యం కంటే ముందుగానే ముగిసిన సెష‌న్స్

ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు డివిజన్‌లు, మండలాలు, రేంజ్‌లు, జిల్లా కేంద్రాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మత పెద్దలతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. కొన్ని నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాలలో లౌడ్‌స్పీకర్లను తొలగించిన తరువాత కూడా తిరిగి వాటిని అమర్చడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల ఏర్పాటును తనిఖీ చేసేందుకు అధికారులు సమావేశాలు, సంభాషణలు నిర్వహించాలని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ సామాన్యుల సంతృప్తి మూలాధారమని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అడ్మినిష్ట్రేషన్ తో సంబంధం అధికారులందరూ దీనిని అర్థం చేసుకోవాలని చెప్పారు. ‘‘ ఐజీఆర్ఎస్-సీఎం హెల్ప్‌లైన్ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మంచి మాధ్యమంగా ఉపయోగపడుతోంది. అందులో వచ్చిన సమస్యలు పెండింగ్‌లో ఉండకూడదు. ప్రతీ కార్యాలయంలో వీటిపై నిరంతర సమీక్ష జరగాలి. అధికారులు, ఉద్యోగులు ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలతో సున్నితంగా ఉండాలి. సామాన్యుడి మనసులో విశ్వాసం పొందాలి. మీ ప్రవర్తన దానికి ఆధారమని గుర్తుంచుకోవాలి. ప్రజల సంతృప్తి మీ పనితీరుకు  ప్రమాణంగా ఉంటుంది.’’ అని ఆయన అన్నారు. 

ఢిల్లీలో అడుగు పెట్టిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం..

రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ అక్రమ ట్యాక్సీ స్టాండ్‌లు, బస్టాండ్‌లు, రిక్షా స్టాండ్‌లు పనిచేయకూడదని సీఎం తేల్చిచెప్పారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు, అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ఇలాంటి స్టాండ్ లు ఉపయోగపడుతున్నాయని, వెంటనే వాటిని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల సమన్వయ ప్రయత్నాల కారణంగా గత ఐదున్నరేళ్లలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై నేరాల కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి చెప్పారు. బాలికలను, మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి సంఘ వ్యతిరేకులను పోలీసులు గుర్తించాలని సూచించారు.

ప్రమాదంలో ఉన్న కన్నతల్లిని కాపాడిన చిన్నారి.. వీడియో వైరల్...!

రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, కొనుగోలు, అమ్మకాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. డ్రగ్స్‌కు బానిసలైన పోలీసులను గుర్తించి వారి సేవలకు స్వస్తి చెప్పాలన్నారు. కోవిడ్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చలి నేపథ్యంలో అన్ని జిల్లాలో నైట్ షెల్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, ట్రాఫిక్ నిబంధనల అమలుకు పెనాల్టీ శాశ్వత పరిష్కారం కాదని అన్నారు. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో పిల్లలు ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే సంస్కారం పిల్లలకు మొదటి నుంచే అలవాటు చేయాలని చెప్పారు. 

click me!