
Woman Congress MLA attacked with knife: ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడి జరిగింది. ఖుజ్జి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. చత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఓ మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయని వార్తాసంస్థ పీటీఐ నివేదించింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు ఖిలేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఖుజ్జి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాహు వేదికపై ఉండగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సాహు మణికట్టుకు స్వల్ప గాయాలు కావడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చురియాకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఈ ఘటనను ఖండించిన ప్రతిపక్ష బీజేపీ ఛత్తీస్ గఢ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించింది. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడికి భద్రత లేనప్పుడు సామాన్యుల భద్రత మాటేమిటని ప్రశ్నించారు. ఇది భూపేశ్ బఘేల్ ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.