గులాం నబీ ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే?

By Mahesh KFirst Published Aug 26, 2022, 3:05 PM IST
Highlights

గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం దురదృష్టకరం అని కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడం విచారకరం అని తెలిపారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ షాక్ ఇచ్చారు. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో మారిన పరిస్థితులే తన రాజీనామాకు కారణమని దాదాపు చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత, ఎన్నో కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం పంచుకున్న గులాం నబీ ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనే సందేహాలు వచ్చాయి.

గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జైరాం రమేశ్ ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్పందించారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా దురదృష్టకరం అని వివరించారు. అంతేకాదు విచారకరం అని వివరించారు. అదీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మొత్తం కాంగ్రెస్ అంతా కూడా ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజనల నేపథ్యంలో బీజేపీపై పోరాడుతున్న సమయంలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం విచారకరం అని అన్నారు.

గులాం నబీ ఆజాద్ ఈ రోజు కాంగ్రెస్‌కు భారీ ఝలక్ ఇచ్చారు. ఆయన పార్టీ పదవులు అన్నింటితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఐదు పేజీల రాజీనామా లేఖ రాశారు. ఇందులో పార్టీతో తన జీవిత ప్రయాణం గురించి, పార్టీ సాధించిన విజయాలు, అపజయాలను ప్రస్తావించారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో సోనియా గాంధీ తీరును మెచ్చుకుంటూనే ప్రస్తుత పరిణామాలపై విమర్శలు చేశారు. కొన్ని సూచనలూ చేశారు. కాగా, రాహుల్ గాంధీపై మాత్రం విరుచుకుపడ్డారు. ఆయన తన రాజీనామా లేఖలో పార్టీలో ప్రతికూల పరిస్థితులు, తప్పుడు పద్ధతులను ఎత్తి చూపారు. తన రాజీనామాకు పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులనే కారణంగా చూపించారు. ఐదు పేజీల తన రాజీనామా లేఖలో ఎక్కువగా పార్టీపై ఘాటు విమర్శలు ఉన్నాయి. ఆయన పేర్కొన్న లోపాలను కారణంగా చూపి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు.

రాహుల్ గాంధీ పిల్ల చేష్టల కారణంగా 2014లో కాంగ్రెస్ ఓడిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉండే సంప్రదింపుల వ్యవస్థను సర్వం నాశనం చేశారని మండిపడ్డారు. ఆయన చుట్టూ కొత్తగా సైకోల కోటరీ ఒకటి ఏర్పడిందని, ఇప్పుడు వారే పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని విమర్శించారు. ఆయన గార్డులు, పర్సనల్ అసిస్టెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.

ఒకప్పుడు కాంగ్రెస్ అంటే జాతీయ ఉద్యమం.. దేశ స్వాంత్ర్యం కోసం పోరాడిన పార్టీ అని గుర్తు చేస్తూ.. ఇప్పుడు కొందరు ఆ పార్టీని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని పరితపిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వ్యవస్థాగత ఎన్నికలు కేవలం ఉట్టి మాయ అని విమర్శించారు. ఒక వేళ గాంధీయేతరులను అధ్యక్షులుగా ఎన్నుకున్న వారు కీలు బొమ్మకు మించి మరేమీ కాదని స్పష్టం చేశారు.

click me!