ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్.. కాంగ్రెస్ కొత్త తీర్మానం.. ‘ఆ పార్టీల భావాలనూ పరిగణనలోకి తీసుకుంటాం’

Published : Mar 28, 2023, 01:03 PM IST
ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్.. కాంగ్రెస్ కొత్త తీర్మానం.. ‘ఆ పార్టీల భావాలనూ పరిగణనలోకి తీసుకుంటాం’

సారాంశం

సావర్కర్ పేరును ప్రస్తావిస్తూ తాను క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో కలకలం రేపాయి. సావర్కర్‌ను అవమానిస్తే సహించబోమని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈ వార్నింగ్ నేపథ్యంలో సోమవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్ కొత్త తీర్మానం ఒకటి చేసుకున్నట్టు సమాచారం.  

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై వేటుతో ప్రతిపక్షాలు ఏక తాటి మీదికి వచ్చాయి. ఆయనకు మద్దతుగా నిలబడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ.. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ కూడగట్టుకునే పనిలో ఉన్నది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో సోమవారం సాయంత్రం విపక్ష పార్టీల నేతలకు ఓ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు ఉద్ధవ్ ఠాక్రే మినహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చారు.

అనర్హత వేటు తర్వాతే నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తాను క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పడానికి తాను సావర్కర్‌ను కాదని, గాంధీని అని పేర్కొన్నారు. సావర్కర్ ఉటంకింపు మిత్ర పక్షం ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీకి ఇది మింగుడుపడలేదు. సావర్కర్ మాట ఎత్తొద్దని ఆ పార్టీ వార్నింగ్ ఇచ్చింది.

Also Read: ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడండి: రాష్ట్రపతికి మమతా బెనర్జీ విజ్ఞప్తి

తమ పూజ్యనేత సావర్కర్‌ను అవమానిస్తే.. మహారాష్ట్రలో విపక్ష కూటమిలో పగుళ్లు వస్తాయని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ‘నేను రాహుల్ గాంధీకి ఓ మాట చెప్పాలనుకుంటున్నా.. మనమంతా ఒక చోటికి వచ్చాం. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఒక చోట చేరాం. కానీ, మన మధ్య విభేదాలు పొడసూపే స్టేట్‌మెంట్లు చేయవద్దు’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాలుక్కరుచుకుంది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన డిన్నర్‌కూ ఆయన పార్టీ డుమ్మా కొట్టింది. ఆయన వార్నింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిన్న సాయంత్రం నిర్వహించిన భేటీలో ఓ కొత్త తీర్మానం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము భావసారూప్య పార్టీలు ఫీలింగ్స్‌నూ తమ పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ సంకేతాలు ఇచ్చినట్టు వివరించాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరయ్యారు.

ఈ భేటీలో కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, ఎన్సీపీ, జనతా దళ్ యునైటెడ్, బీఆర్ఎస్, ఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎండీఎంకే, కేసీ, టీఎంసీ, ఆర్ఎస్‌పీ, ఆర్జేడీ, జేఅండ్‌కే ఎన్సీ, ఐయూఎంఎల్, వీసీకే, ఎస్పీ, జేఎంఎం నేతలు హాజరయ్యారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?