
కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ (congress) కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (kc venugopal) నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. సోనియా (sonia gandhi) , రాహుల్‌లు (rahul gandhi) ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళనపై ఈ భేటీపై చర్చించనున్నారు. వర్చువల్‌గా జరగనున్న భేటీకి పార్టీ కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. భేటీకి ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం వుంది. అటు జూన్ 13న ఢిల్లీ రావాలని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఎంపీలతో ర్యాలీ నిర్వహించే అవకాశం వుంది.
కాగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో (national herald case) విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోరింది. తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, మరో కొన్ని రోజుల సమయం కావాలని కోరారు. గత వారం COVID-19 బారిన పడిన సోనియా గాంధీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చిక్సిత పొందుతున్నారు.
అయితే.. తనకు ఇంకా కరోనా వైరస్ నెగెటివ్ రాలేదని, ఐసోలేషన్‌లో ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సోనియా గాంధీ ఈడీకి తెలియజేసింది. తనకు కొంత సమయం కావాలని, విచారణను మరో తేదీకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోనియా కార్యాలయం ఈడీకి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో జూన్ 2, జూన్ 7 నాటి వైద్య నివేదికలు కూడా EDకి పంపించారు. మరో మూడు వారాలు గడువు కావాలని ఈడీని సోనియాగాంధీ కోరినట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసు విషయంలో జూన్ 8 న సోనియా గాంధీ, తన కుమారుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ED ముందు హాజరు కావాల్సి ఉండే.. పలు కారణాలతో ఇద్దరు నేతలు హాజరు కాలేకపోయారు.
ఇదిలా ఉండగా.. జూన్ 13న రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరుకానున్నారు. తొలుత ఈ కేసు విచారాణలో జూన్ 8న పాల్గొనాల్సిందిగా ఆయనకు ముందుగా సమన్లు అందాయి, అయితే.. తాను విదేశాల్లో ఉన్నందున ఆ సమయానికి విచారణకు హాజరుకాలేనని ఈడీని కోరడంతో.. తాజాగా జూన్ 13న విచారణలో పాల్గొనేందుకు గడువు ఇచ్చారు. అయితే.. జూన్ 13న రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు .. కాంగ్రెస్ తన బలాన్ని ప్రదర్శించాలని యోచిస్తోంది. రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలకు కూడా ఈడీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లనున్నట్టు సమాచారం.