
Punjab: ఇటీవలి పంజాబ్‌లో జరిగిన పరిణామాలకు వ్యతిరేకంగా.. చండీగఢ్‌లోని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వెలుపల ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గురువారం నాడు ఆకస్మిక నిరసన ప్రదర్శన చేశారు. ఈ తరుణంలో పలువురు పార్టీ నాయకులు, మాజీ మంత్రులతో సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర భద్రతతో పాటు ఇటీవల అరెస్టయిన పంజాబ్ మాజీ అటవీ మంత్రి సాధు సింగ్ ధరమ్‌సోత్ అంశంతో పాటు.. పలు అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. అయితే..వారిని కలిసేందుకు సిఎం మాన్‌ను నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఎం నివాసం వెలుపల కూర్చుని నిరసనలు, నినాదాలు చేయడం ప్రారంభించారు.
ఆందోళన చేస్తున్న నేతలు ఎలాంటి గందరగోళం సృష్టించకుండా ఉండేందుకు ఇంటి బయట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. క్రమంగా నిరసనలు తీవ్రం కావడంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ చేసిన అనంతరం కాంగ్రెస్ నేతలను సెక్టార్ 3 పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్‌ను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
అరెస్ట్ అయినా నాయకుల్లో.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు పర్తాప్ బజ్వా, మాజీ డిప్యూటీ సీఎం OP సోనీ, సుఖ్‌జిందర్ సింగ్ రంధావా కూడా ఉన్నారు.
కాంగ్రెస్ నేతలు తమ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ.. సమావేశానికి అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పటికీ కలిసేందుకు సీఎం అనుమతి నిరాకరించారని ఆరోపించారు. ఉదయం 10 గంటలకు అపాయింట్ మెంట్ ఉన్నట్టు నేతలు పేర్కొన్నారు. మరోవైపు అపాయింట్‌మెంట్ లేకుండా వచ్చినందుకు నేతలు తిరస్కరించినట్లు సమాచారం.
ఈ విషయంపై సీఎం మాన్ స్పందిస్తూ.. పంజాబ్ కాంగ్రెస్ నేతల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. ముడుపుల కేసులను ఎదుర్కొంటున్న తమ నేతలకు అనుకూలంగా నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ నేతలు తన నివాసం వద్ద నిరసన చేపట్టారని, పంజాబ్‌ను దోచుక తిన్న వారికి మద్దతు పలుకుతూ.. తమ రక్తంలోనే అవినీతి ఉందని వెల్లడించారని, అవినీతి కాంగ్రెస్ నేతల హక్కుగా మారిందని సీఎం
మాన్ ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి సాధు సింగ్ ధరమ్‌సోత్ అరెస్ట్ వ్యవహారంపై మాట్లాడేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం ఆపై తమతో భేటీకి నిరాకరించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇటీవల పంజాబ్‌లో హత్యకు గురైన గాయకుడు-నాయకుడు సిద్ధూ మూస్వాలాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం భగవంత్ మాన్, ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పంజాబ్ మాజీ అటవీ మంత్రి అరెస్ట్..
అంతకుముందు మంగళవారం నాడు .. అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్ర మంత్రి సాధు సింగ్ ధరమ్‌సోత్‌ను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. దళిత స్కాలర్‌షిప్ స్కీముల్లో కోట్లాది రూపాయల స్కామ్‌కు ప్రధాన సూత్రధారిగా సాధుసింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
అవినీతి కేసులో జిల్లా అటవీ అధికారి గురమన్‌ప్రీత్ సింగ్, కాంట్రాక్టర్ హర్మీందర్ సింగ్ హమ్మీ లు అరెస్టయిన కొన్ని రోజుల తర్వాత .. మాజీ రాష్ట్ర మంత్రి సాధు సింగ్ ధరమ్‌సోత్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వీరిద్దరూ ధర్మసోత్ మంత్రిగా ఉన్నప్పుడు వీరిద్దరూ అటవీ శాఖలో జరిగిన అవకతవకలకు సంబంధించిన వివరాలను అందించినట్లు తెలిసింది.