ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నది.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో ముగిశాయి. 17వ తేదీనే రెండో దశ ఎన్నికలు ముగిసినా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ఎన్నికలు ముగియగానే వెలువడ్డాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉన్నదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. కొంచెం ఎడ్జ్‌తో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు సర్వే అంచనాలు తెలిపాయి. పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏబీవీ సీవోటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 53 సీట్ల వరకు వస్తాయని, బీజేపీకి 36 నుంచి 48 స్థానాలు దక్కుతాయి. కాంగ్రెస్ పార్టీకి 43.4 శాతం, బీజేపీకి 41.2 శాతం ఓటు శాతం దక్కుతుందని ఇదే సర్వే తెలిపింది.
యాక్సిస్ మై ఇండియా- ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం, కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 40 నుంచి 50 స్థానాలను గెలుచుకుంటుంది. బీజేపీ 36 నుంచి 46 సీట్లలో విజయం సాధిస్తుంది. వోటు షేరులోనూ కాంగ్రెస్‌కు 42 శాతం, బీజేపీకి 41 శాతం దక్కుతుంది. బీఎస్పీకి 6 శాతం, ఇతరులకు 11 శాతం ఓటు శాతం దక్కే అవకాశం ఉన్నది.
రిపబ్లిక్ పీ మార్క్ మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, బీజేపీకి 34 నుంచి 42 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 44 నుంచి 52 వరకు సీట్లు దక్కుతాయి. సీవోటర్, యాక్సిస్ సర్వేల్లోనూ దాదాపు ఇదే తీరు ఉన్నది.
Also Read: Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’.. పుంజుకున్న బీజేపీ
టుడేస్ చాణక్య న్యూస్ 24 ఎగ్జిట్ పోల్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 57 సీట్లు, బీజేపీకి 33 సీట్లు దక్కుతాయని ఈ సర్వే తెలిపింది.
బఘేల్‌కు మరో టర్మ్?
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లలో 68 స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకుంది. 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వానికి 2018లో కాంగ్రెస్ ఫుల్ స్టాప్ పెట్టింది. భూపేశ్ బఘేల్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కాలంలో భుపేశ్ బఘేల్ ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఓబీసీ ఫేస్‌గా భూపేశ్ బఘేల్ ప్రచారం పొందారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన కలిసివచ్చారు. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూపేశ్ బఘేల్ మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నది.