
Congress March: నేషనల్ హెరాల్డ్ (National Herald) కేసు విచారణలో భాగంగా నేడు( సోమవారం) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. కాగా.. ఈడీ చర్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ సంఘీభావ ప్రదర్శన చేపట్టాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ED కార్యాలయాల ముందు సత్యాగ్రహం చేయాలని కూడా కాంగ్రెస్ యోచిస్తోంది. ఎంపీలు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అనుకోని ఎదురుదెబ్బ తాగిలింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్చ్ కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
కాంగ్రెస్ శ్రేణులు పార్టీ ప్రధాన కార్యాలయం 24 అక్బర్ రోడ్ నుంచి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మార్చ్ చేయాలని ప్లాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీని దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ..కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలందరూ న్యూఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయం వైపు నిరసన ప్రదర్శన చేపట్టాలని, అలాగే 'సత్యాగ్రహం' చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్య్టా.. శాంతిభద్రతల కారణంగా ఢిల్లీ పోలీసులు రాజధానిలో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతించలేదు. దీంతో పాటు అన్ని జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఈ క్రమంలో న్యూఢిల్లీ జిల్లా పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేశారు. న్యూఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులపై పోలీసు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బారికేడ్ వద్ద పోలీసులు తనిఖీ చేసిన తర్వాతే వాహనాలు ముందుకు వెళ్తాయి.
కాంగ్రెస్‌ను టార్గెట్
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ తన కుటుంబ ప్రమేయం గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు నిజం ఒప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆదివారం అన్నారు. ఈడీని ఎదుర్కోవడానికి గాంధీ కుటుంబం భయపడుతోందని పాత్రా పేర్కొన్నారు. 500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు రాహుల్ గాంధీ ఈడీ ఎదుటకు వెళ్లి నిజం చెప్పాలి. ముందుగా నేషనల్ హెరాల్డ్ కేసులో నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.
మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడం నిరాధారమని, బీజేపీ నేతలకు లేదా ఆ పార్టీ పాలిత రాష్ట్రాలకు వర్తించదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆదివారం అన్నారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత నెలకొల్పేందుకు అన్ని విధాలా కృషి చేయాలని, అది నెరవేరుతుందని చిదంబరం అన్నారు.