శశిథరూర్‌కు అరుదైన గౌరవం.. కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం.. కాంగ్రెస్ నేతల ప్రశంసలు

By Mahesh KFirst Published Aug 11, 2022, 8:15 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. శశిథరూర్ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డు ఇవ్వడానికి ఫ్రాన్స్ నిర్ణయించింది.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఫ్రాన్స్ దేశం చెవలియర్ డి లా లీజియన్ డి ఆనర్ అవార్డును ఇవ్వనుంది. ఈ మేరకు ఫ్రెంచ్ అంబాసిడర్.. కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు సమాచారం ఇచ్చారు.

శశిథరూర్ రచన, ప్రసంగాలు, పాండిత్యాన్ని గుర్తిస్తూ.. గౌరవిస్తూ ఈ అవార్డును ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. శశిథరూర్ పాండిత్యాన్ని గౌరవిస్తూ తమ దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఫ్రెంచ్ అంబాసిడర్ ఎమ్మాన్యుయెల్ లెనయిన్.. కాంగ్రెస్ నేతకు లేఖ రాశారు. ఈ అవార్డు గురించి ఆయనకు తెలియజేశారు. 

దీనిపై స్పందిస్తూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌తో సంబంధాలను తాను ఇష్టపడతానని, భాషను ఇష్టపడే, సంస్కృతిని అభిమానించే వ్యక్తిని తాను అని వివరించారు. అలాంటి నాకు ఈ విధమైన గుర్తింపు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ అవార్డుకు తాను సరిపోతానని నిర్ణయించి తనకు అ గౌరవం కల్పించిన వారికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

శశిథరూర్‌కు దక్కిన అరుదైన గౌరవాన్ని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి శశిథరూర్‌ పై ప్రశంసలు కురిపించారు. ఈ విషయం తెలిసిన తాను పూర్తిగా సంతోష డోలికల్లో ఊగిపోయానని వివరించారు. అసాధారణ పాండిత్యం, లోతైన జ్ఞాన సంపద గల శశిథరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించడం తనను సంతోషపెట్టిందని వివరించారు. దీనికి శశిథరూర్ ధన్యవాదాలు తెలిపారు. 

కాంగ్రెస్ నేతలు టీఎస్ సింగ్ దియో, ప్రద్యూత్ బర్డోలాయ్, మొహమ్మద్ జవాయిద్, ప్రవీన్ చక్రవర్తి సహా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంకే మునీర్ కూడా శశిథరూర్‌కు అభినందనలు తెలిపారు.

click me!