
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఆశాజనక ప్రదర్శన కనబర్చలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. గతంలో ఉన్న సీట్లను కూడా ఈ సారి సాధించుకునేలా లేదని అంచనాలు విశదపరుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెప్పేలా ఫలితాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీ మెజార్టీ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా, గోవాలోనూ కాంగ్రెస్ వెనుకబడి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించేలా ఉన్నది. ఐదు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ ఎన్నికల ద్వారా ఉన్న బలంలో 60 స్థానాలను కాంగ్రెస్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆమె సారథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అయినప్పటికీ గతంలో కంటే కూడా సుమారు 3 శాతం పార్టీ ఓటు షేరును కోల్పోయినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో దారుణంగా ఓటు షేర్ కోల్పోయేలా ఉన్నది. 2017లో 77 స్థానాలు గెలిచినప్పుడు కాంగ్రెస్ ఓటు షేరింగ్ 38.5 శాతంగా ఉంది. కానీ, నేడు అది 23.3 శాతానికి పడిపోయేలా ఉన్నది. గోవాలోనూ గతంలో కంటే 8 స్థానాల్లో వెనుకబడే ఉన్నది. అలాగే, మణిపూర్‌లోనూ కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని మూటగట్టుకునేలా ఉన్నది. ఈరాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేర్ సగానికి సగం పడిపోయేలా ఉన్నది. 2017లో ఇక్కడ 35.1 శాతం ఓటు షేరింగ్ ఉంటే.. ఇప్పుడు 17 శాతానికే పరిమితం అయ్యేలా ఉన్నది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై స్పందించారు. ప్రజా తీర్పును తాను సవినయంగా అంగీకరిస్తున్నట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజా మద్దతు చూరగొని గెలిచిన వారికి అభినందనలు అని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి పట్టుబడిన, కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, వాలంటీర్లకు, వారికి కఠోర శ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. దీని నుంచి తాము నేర్చుకుంటామని, భారత దేశ ప్రజల ప్రయోజనాల కోసం తమ కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఓటమిని అంగీకరిస్తూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, ముందు ముందు పోరాడాల్సే ఉన్నదని, ఇంకా కొనసాగించాల్సే ఉన్నదని కార్యకర్తలకు తెలిపారు.