
Union Education Minister Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీజేపీ యువమోర్చా మాజీ జాతీయ అధ్యక్షుడు ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ విద్వేషాల దుకాణం, కేజ్రీవాల్ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ మాటలకు-చేతలకు పొంతనలేకుండా ఉందనీ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు.
వివరాల్లోకెళ్తే.. దేశరాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో శనివారం జరిగిన ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ తన 8 సంవత్సరాల పాలనను, ప్రధాని మోడీ పాలనను అభివృద్దిలో పోల్చి చూడాలంటూ ఆయన సవాల్ విసిరారు. దీంతో ఆప్-బీజేపీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ విద్వేషాల దుకాణం అనీ, కేజ్రీవాల్ అబద్ధాల కర్మాగారాన్ని నడుపుతున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. "ఆ రెండు పార్టీలకు తేడా లేదు. ఢిల్లీ ప్రజల డబ్బుతో కోట్లాది రూపాయలతో షీష్ మహల్ ను నిర్మించిన అరవింద్ కేజ్రీవాల్ మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం ఉందనీ, కోట్లాది రూపాయల విలువ చేసే 'కర్టెన్లు' వేసినా దాన్ని కవర్ చేయలేరని" ఆయన అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా ఏమన్నారంటే.. ?
కాంగ్రెస్ విద్వేషాల దుకాణం అనీ, కేజ్రీవాల్ అబద్ధాల కర్మాగారాన్ని నడుపుతున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీజేపీ యువ మోర్చా మాజీ జాతీయ అధ్యక్షుడు ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కాంగ్రెస్ 'దోపిడీ, అబద్ధాలు'లో నిష్ణాతురాలైతే, కేజ్రీవాల్ 'దోపిడీ, అబద్ధాలు' రెండింటికీ అధిపతి అని విమర్శించారు. మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా, "ఢిల్లీ ప్రజల సొమ్ముతో కోట్లాది రూపాయలతో 'షీష్ మహల్' నిర్మించిన అరవింద్ కేజ్రీవాల్ మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం ఉంది. కోట్లాది రూపాయల విలువ చేసే 'తెరలు' వేసినా దాన్ని కవర్ చేయలేరు. ఉద్యమ గర్భం నుంచి పుట్టిన కేజ్రీవాల్ రాజకీయం ఉద్యమంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసింది" అంటూ . కేజ్రీవాల్, ఆప్ పార్టీపై విరుచుకుపడ్డారు.