కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం 16న సీడబ్ల్యూసీ భేటీ.. పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకేనా?

By telugu teamFirst Published Oct 9, 2021, 4:02 PM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నది. గాంధీ అనుయాయులు రాహుల్ గాంధీని ఆ బాధ్యతలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా, జీ 23, ఇతర కొందరు నేతలు తిరస్కరిస్తున్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ ఎన్నికల అంశంపైనే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీ శనివారం సమావేశం కానుంది.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి కోసం కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్నది. పార్టీ నేతలే ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొందరు rahul gandhiనే నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని భావిస్తుండగా మరికొందరు మాత్రం పార్టీలో సమూల మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిని కచ్చితమైన విధానంలో ఎన్నుకోవాలని పట్టుబడుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ వైఫల్యం తర్వాత congress పార్టీ మళ్లీ నిలదొక్కుకోలేదు. అప్పటి నుంచి పార్టీ సారథ్యంపై చర్చ జరుగుతూనే ఉన్నది.

ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. పార్టీ గురించిన నిర్ణయాలు తీసుకునే ఉన్నతస్థాయి కమిటీ ఇదే. ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్‌లో శనివారం ఉదయం 10 గంటలకు CWC సమావేశం జరుగుతుందని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, వ్యవస్థాగత ఎన్నికలు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండగా ఉంటాయని ట్వీట్ చేశారు.

A meeting of the Working Committee will be held on Saturday, the 16th October, 2021 at 10.00 a.m. at AICC Office, 24, Akbar Road, New Delhi to discuss current political situation, forthcoming assembly elections & Organisational elections.

— K C Venugopal (@kcvenugopalmp)

పార్టీ president బాధ్యతలు రాహుల్ గాంధీ తీసుకోవాలని గాంధీ అనుయాయులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అధ్యక్ష పదవిపై మొదటి నుంచి ప్రతికూలంగా ఉన్న రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనపై సుముఖంగా లేరు. మధ్యలో కొన్ని నెలలు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నా మళ్లీ వెనక్కి తగ్గారు. దీంతో సోనియా గాంధీనే మళ్లీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు sonia gandhiనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తదుపరి జరగనున్న పార్టీ వ్యవస్థాగత ఎన్నికల్లో రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచన మెజార్టీ గాంధీ అనుయాయుల్లో ఉన్నది.

కాగా, కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాల్సిందేనని, సమూల మార్పులు చేయాలని వాదిస్తున్న జీ 23(కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్న 23 మంది నేతలు) సభ్యులు అందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. ఇటీవలే ఈ G-23నకు చెందిన kapil sibal గాంధీలకు లేఖ రాసి సంచలనం లేపారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎన్నికైన అధ్యక్షుడు లేరని, పార్టీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తెలియడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. తాము ఒకరికి లొంగి ఉండాల్సిన పనిలేదని, తాము ఎప్పుడూ సమస్యలు లేవదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

click me!