
కేరళలో కాంగ్రెస్ - సీపీఎంల మధ్య వైరం కొనసాగుతోంది. వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి వి. మురళీధరన్ స్పందించారు. సీఎం పినరయి విజయన్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, సీపీఎంల మధ్య ఘర్షణల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడం సీఎం కర్తవ్యమని అన్నారు. ‘‘ కేరళలో కాంగ్రెస్, సీపీఎం ఘర్షణల మధ్య సామాన్య ప్రజల సాధారణ జీవితం కష్టంగా మారింది. శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం, అధికార పార్టీ విధి. వాటిని నియంత్రించాలని నేను సీఎం విజయన్‌ను కోరుతున్నాను. ’’ అని మురళీధరన్ వార్తా సంస్థ ANI కి చెప్పారు.
కాగా రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడికి సంబంధించి అధికార సీపీఎం విద్యార్థి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)కి చెందిన మొత్తం 19 మంది కార్యకర్తలను ఇప్పటివరకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కేరళ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారందరినీ స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలుగా గుర్తించి స్థానిక కోర్టు వారికి రెండు వారాల రిమాండ్ విధించింది. ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేసినట్లు, మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ రోజు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును మనంతావాడి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే ఏడీజీపీ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తామని తెలిపారు.
Maharashtra crisis: ముదురుతున్న 'మహా' రాజకీయ సంక్షోభం.. ముంబయి, థానేల్లో 144 సెక్షన్ !
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు పట్టుకున్న కొందరు గూండాలు రాహుల్ గాంధీ వాయనాడ్ కార్యాలయం గోడ ఎక్కి కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆ పార్టీ ట్వీట్ లో ఆరోపించింది. ఇది పోలీసుల సమక్షంలోనే జరిగిందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘‘ ఇది సీపీఎం నాయకత్వం చేస్తున్న స్పష్టమైన కుట్ర. గత ఐదు రోజులుగా ఐడీ రాహుల్ గాంధీని ప్రశ్నింస్తోంది. కేరళ సీపీఎం ఇలాంటి పని ఎందుకు చేస్తుందో అర్థం కావడంలేదు. సీతారాం ఏచూరి తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ’’ అని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయాన్ని సీపీఐ విద్యార్థి విభాగం, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ‘‘సీఎం పినరయి విజయన్, సీతారాం ఏచూరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా ? లేదా అలాంటి ప్రవర్తనను ఖండిస్తారా? ఇదేనా ఆయన రాజకీయ ఆలోచన ? ఇది వ్యవస్థీకృత గూండాయిజం ’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. ఈ ప్రణాళికాబద్ధమైన దాడికి సీపీఎం ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
Corona: జైలులో కరోనా కలకలం.. 9 మంది ఖైదీలకు పాజిటివ్
మరోవైపు రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన నేరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం చెప్పారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో తన అభిప్రాయాన్ని, నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు. హింస అనేది తప్పుడు ధోరణి అని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.