చౌకీదార్ చోర్ వ్యాఖ్యలు: సుప్రీంకు రాహుల్ బేషరతు క్షమాపణలు

By Siva KodatiFirst Published May 8, 2019, 11:18 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించి మాట్లాడిన వ్యవహారంలో అత్యున్నత న్యాయస్ధానాన్ని క్షమాపణలు వేడుకున్నారు రాహుల్.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించి మాట్లాడిన వ్యవహారంలో అత్యున్నత న్యాయస్ధానాన్ని క్షమాపణలు వేడుకున్నారు రాహుల్.

చౌకీదార్ చోర్ వ్యాఖ్యలను సుప్రీం సమర్ధించినట్లుగా గతంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్ధానం రాహుల్ తీరును తప్పుబట్టింది.

ఒకటికి రెండు సార్లు అఫిడవిట్లను దాఖలు చేసినా వాటిలో ఎక్కడా కూడా రాహుల్ క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేకపోవడంతో చీఫ్ జస్టిస్ ఫైరయ్యారు. దీంతో కాంగ్రెస్ చీఫ్ బేషరుతుగా క్షమాపణలు చెబుతూ బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు. 

సుప్రీంకోర్టు అత్యున్నత సంస్ధ అని, దాని మీద తనకు అపార గౌరవం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ విధానాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జోక్యం చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని రాహుల్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనపై నమోదైన నేరపూరిత కోర్టు ధిక్కార కేసు విచారణను మూసేయాలని రాహుల్ గాంధీ కోర్టును అభ్యర్ధించారు.

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించిన ఒప్పందంపై గతేడాది ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీం ఏప్రిల్ 10న ఉత్తర్వులిచ్చింది.

దీంతో చౌకీదార్ చోర్ అని ఈ తీర్పు స్పష్టం చేస్తుందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే న్యాయస్థానం తీర్పును కాంగ్రెస్ అధ్యక్షుడు తప్పుగా వ్యాఖ్యానించారంటూ బీజేపీ నేత మీనాక్షీ లేఖీ సుప్రీంలో పిటిషన్ వేశారు. 

click me!