Punjab Elections 2022 : పంజాబ్ కాంగ్రెస్​ తొలి జాబితా విడుద‌ల‌ సిద్ధం.. రెండు స్థానాల్లో సీఎం పోటీ!

By Rajesh KFirst Published Jan 14, 2022, 1:25 PM IST
Highlights

Punjab Elections 2022: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో మ‌రోసారి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని కాంగ్రెసు ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం.. పోటీ చేసేందుకు 70 మందికిపైగా అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్​ సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి.
 

Punjab Elections 2022: వచ్చే నెలలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్నాయి. ప్రత్యర్థులను ఢీకొట్టే బలమైన అభ్యర్థులపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పంజాబ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 

ఎలాగైనా మ‌రో మారు అధికారం చేప‌ట్టాల‌ని అధికార కాంగ్రెస్ య‌త్నిస్తుంటే.. ఆప్ కూడా వ్యూహా ప్ర‌తి వ్యూహాల‌ను ర‌చిస్తోన్నాయి. పంజాబ్ బీజేపీ కూడా త‌గ్గేదేలే అన్న‌ట్టు దూసుక‌పోతుంది. ఇప్ప‌టికే సీఎం చ‌న్నీ సోద‌రుడిని త‌న పార్టీలోకి లాక్కుంది బీజేపీ. పంజాబ్ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసింది. మరోమారు అధికారాన్ని త‌న హస్తగతం చేసుకోవాలని ప్ర‌యత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ  అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నేటి సీఈసీ సమావేశం తర్వాత తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.          

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్ర‌మంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ముమ్మ‌ర కసరత్తు చేసింది పంజాబ్​ కాంగ్రెస్​. ఈ మేర‌కు కాంగ్రెస్​ కేంద్ర ఎన్నిక‌ల కమిటీ గురువారం వర్చువల్​ స‌మావేశమైంది.  తొలి బాబితాలో దాదాపు 70 మందికిపైగా అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. మరోమారు కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తుది జాబితాను ఖరారు చేయనున్న‌ట్టు స‌మాచారం. శుక్రవారమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు మరికొంత మంది నేతలు పేర్కొన్నారు. 

అయితే.. పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీని రెండు స్థానాల్లో బరిలో దించాలని కాంగ్రెస్​ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం సీఎం  చ‌న్నీ ప్రాతినిధ్యం వహిస్తున్న చమ్​కౌర్​ నియోజకవర్గంతో పాటు     దోవోబా ప్రాంతంలోని అదంపుర్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం చన్నీని బరిలో దింపేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతోంది. అలాగే.. సిట్టింగ్​ ఎంపీలను సైతం అసెంబ్లీ బరిలో దించాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ ఎంపీ జస్బిర్​ సింగ్​ గిల్​.. త‌న‌ను పార్టీ కోరితే అసెంబ్లీ బరిలో నిలిచేందుకు తాను సిద్ధమని ప్రకటించారు ​.

అయితే, ఆ నిర్ణయం కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఉందన్నారు. పోటీ చేయాలని ఆమె సూచిస్తే.. తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటానని ధీమా వ్య‌క్తం చేశారు. మరోవైపు.. త్వరలోనే పదవీ కాలం ముగియనున్న రాజ్యసభ ఎంపీ ప్రతాప్​ సింగ్​ బజ్వా కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో డజనుకు పైగా సిట్టింగ్ ఎంపీలు పోటీలో దించింది తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి). ఇదే వారికి ఉదాహరణగా నిలిచింది.  

పంజాబ్‌లో ఒకే దశలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది.. సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది.  117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లు సాధించింది. ఈ సారి ప్ర‌జ‌లు ఏ పార్టీకి ప‌ట్టం క‌డుతారో వేచి చూడాలి. 

click me!