ఇంటి వద్దే ఉండి సంపాదించుకోండని ఆమెకు వాట్సాప్‌లో ఓ మెసేజీ వచ్చింది. దాన్ని నిజమే అని నమ్మిన ఆమె ఓ సైబర్ కేటుగాడి చేతిలో దారుణంగా మోసపోయింది. రూ. 2 లక్షల వరకు ఆమె పోగొట్టుకుంది. గుజరాత్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అహ్మదాబాద్: ఇంటి వద్ద ఉండే సంపాదించుకోండని, లైక్‌లు కొడితే చాలు డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. వాట్సాప్ మెస్సేజీ చేసి ప్రలోభ పెట్టారు. అంగీకరించగానే ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి తొలుత కొద్ది మొత్తాల్లో డబ్బులు అప్పజెప్పారు. ఆ తర్వాత ఏకంగా రూ. 2 లక్షలు కాజేశారు. అన్ని డబ్బులు కట్టేసిన తర్వాత తాను మోసపోయానని ఆ మహిళకు తెలిసి వచ్చింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయింది. అహ్మదాబాద్‌లో ఘుమాలోని విభూష బంగ్లా సమీపంలో నందవిహార్ రెసిడెన్సీలో నివసిస్తున్న 38 ఏళ్ల రచన భావసర్‌కు ఓ వాట్సాప్ మెస్సేజీ వచ్చింది. డిసెంబర్ 8న జారా అని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెకు మెస్సేజీ చేశారు. పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీకిది సదవకాశం అంటూ మొదలు పెట్టారు.
జారా అనే వ్యక్తి ఇచ్చిన ఆఫర్ రచన భావసర్‌కు నచ్చింది. తాను వారు ఆఫర్ చేస్తున్న పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి సిద్ధం అని తెలిపింది. దీంతో ఆమెకు మరో నెంబర్ నుంచి ఒకరు కాంటాక్ట్ అవుతారని, వారికి ఆమె వివరాలు ఫార్వార్డ్ చేస్తున్నట్టు జారా చెప్పారు. ఆ తర్వాత మరో నెంబర్ నంచి ఓ మెస్సేజీ ఆమెకు వచ్చింది. పలు రకాల వీడియోలను లైక్ చేయాల్సి ఉంటుందని, యూట్యూబ్ చానెళ్లను సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందని జాబ్ టాస్క్‌ను వివరించారు. అందుకు రచన సరే అంది.
ఆ తర్వాత ఆమెను ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు. అందులో పలు రకాల వీడియోలు, చానెళ్ల లింక్‌లు వచ్చాయి. రచన ఆ వీడియోలను లైక్ చేసింది. ఆ లింక్‌లు ఓపెన్ చేసి యూట్యూబ్ చానెళ్లను సబ్ స్క్రైబ్ చేసింది. తొలుత ఆమెకు మూడు నుంచి నాలుగు లైక్‌లు, సబ్ స్క్రైబ్‌లకు రూ. 150లు ఇచ్చారు.
Also Read: రైల్వే స్టేషన్‌లో పోర్న్ క్లిప్.. ఖంగుతిన్న ప్రయాణికులు.. వీడియోలు వైరల్
డిసెంబర్ 12వ తేదీన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఓ మెస్సేజీ వచ్చింది. లైక్‌లు, సబ్ స్క్రైబ్ టాస్క్ కోసం రూ. 10 వేలు డిపాజిట్ చేయాలని ఆ మెస్సేజీ సారాంశం. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లో ఆమె డబ్బులు పేమెంట్ చేసింది. కానీ, డబ్బులేమీ రాలేవు.
ఆ సైబర్ ఫ్రాడ్‌స్టర్ వేరు వేరు టాస్కులు చెబుతూ డబ్బులు గుంజడం మొదలు పెట్టాడు. ఆమె వాటిని నమ్మి డబ్బులు కడుతూనే పోయింది. కానీ, తనకు ఎందులోనూ డబ్బులు రావడం లేదని ఆమె గ్రహించింది. ఆ తర్వాత తాను మోసపోయినట్టు గుర్తించింది. సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసింది. బోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.