
బస్టాండ్ ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులోని చిదంబరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ప్రస్తుతం తమిళనాడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. తమిళనాడులోకి కడలూరు జిల్లా చిదంబరంలో చిన్న చిన్న గ్రామాలకు వెళ్లే బస్ స్టాప్ ఉంది. అక్కడ స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థినికి.. పాలిటెక్నిక్ విద్యార్థి తాళి కట్టాడు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు కూడా వారి స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్‌లోనే ఉన్నారు. తోటి విద్యార్థులు వారిపై పూలకు బదులుగా కాగితాలు చల్లి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీడియోలో ఉన్న విద్యార్థిని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నట్లు కూడా చెబుతున్నారు. విద్యార్థినికి తాళి కట్టిన విద్యార్థి కీరపాళ్యం సమీపంలోని ఉత్తర హరిరాజపురం ప్రాంతానికి చెందినవాడని సమాచారం. అక్కడే ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారి తీవ్ర సంచలనం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు.. విద్యార్థుల చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఈ రోజుల్లో కాలేజీ అమ్మాయిలు బాగానే ప్రవర్తిస్తున్నారు.. కానీ స్కూల్ అమ్మాయిల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి స్కూల్ బ్యాగ్, మొబైల్ ఫోన్‌ని పర్యవేక్షించాలి” అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. అయితే ఈ ఘటనలో అబ్బాయిని మాత్రమే కాదని.. అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక, కడలూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించారు. పెళ్లి చేసుకున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ కేసులో తదుపరి చర్యలపై పోలీసులు సమాలోచనలు జరుపుతున్నారు.