
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటచేసుకుంది. చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌లో ఓ కాలేజ్ విద్యార్థిని ఆమెకు పరిచయం ఉన్న యువకుడు కదులుతున్న రైలు కిందకు తోసేశాడు. ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు.. బాధిత యువతికి, నిందితుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా నిందుతుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ప్రాథమిక నివేదిక ప్రకారం బాధితురాలు ఆదంబాక్కంకు చెందిన ఎస్ సత్య (20)గా గుర్తించారు. సత్య నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో బీకామ్ సెకండ్ ఈయర్ చదువుతుంది. ఆమె తల్లి మహిళా కానిస్టేబుల్.
అయితే ఈ రోజు సత్యను ఆదంబాక్కంకు చెందిన సతీష్ (32) రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే కొద్దిసేపటికే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సతీష్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి సత్యతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తాంబరం నుంచి ఎగ్మోర్ వైపు వెళ్తున్న రైలు ముందుకి సత్యను తోసేశాడు. దీంతో రైలు కిందపడిపోయిన సత్య ప్రాణాలు కోల్పోయింది. వెంటనే సతీష్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే సత్య, సతీష్‌ల మధ్య వివాదం నడుస్తోంది.. ఇది వారిద్దరి కుటుంబాలకు కూడా తెలుసునని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై రైల్వే స్టేషన్‌లో ఉన్నవారి నుంచి సమాచారం అందుకున్న తాంబరం, మాంబళం రైల్వేస్టేషన్ల నుంచి గవర్నమెంట్ రైల్వే పోలీసులు.. అక్కడి చేరుకుని సత్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిందితుడు సతీష్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు.