
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో ఎవరికీ అర్థం కాని సమస్య ఒకటి ఉత్పన్నమైంది. చాలా మంది యూజర్లు అనూహ్యంగా వేల కొలది తమ యూజర్లను కోల్పోయారు. ఏకంగా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫాలోవర్ల సంఖ్యనే సుమారు 11.9 కోట్ల నుంచి దాదాపు పది వేలకు పడిపోయారు. ఈ పరిణామంపై యూజర్లు ఆందోళన చెందారు. చాలా మంది ట్విట్టర్ వేదికలో ఈ సమస్యపై చర్చించారు. అయితే, దీనిపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా వివరణ ఇచ్చింది.
ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ విషయాన్ని ఇలా ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్ ఓ సునామీని సృష్టించిందని, అందులో తన 9 లక్షల ఫాలోవర్లు కొట్టుకుపోగా ఒడ్డుకు కేవలం 9 వేల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ ఫాలోవర్లు కూడా ఇప్పుడు అటూ ఇటుగా 9 వేలు ఉన్నారని తెలిపారు.
కాగా, ఈ తరుణంలోనే రూమర్లూ పెద్ద ఎత్తులో చక్కర్లు కొట్టాయి. జుకర్‌బర్గ్ అకౌంట్ హ్యాక్ అయిందనే వదంతులు వచ్చాయి. అయితే, ఆయన అకౌంట్ బాగానే ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, మెటా సంస్థ బాట్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నదని కొందరు.. ఇంకొందరు సైబర్ అటాక్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాల పేరెంట్ కంపెనీ మెటా తీవ్రవాద సంస్థనటా.. ఎక్కడంటే?
ఈ పరిణామంపై ఫేస్‌బుక్ స్పందించింది. కంపెనీకి ఈ సమస్యపై అవగాహన ఉన్నదని, భారీ సంఖ్యలో ఫాలోవర్ల సంఖ్య తగ్గుతున్నదనే విషయం తమ దృష్టిలో ఉన్నదని తెలిపింది. అయితే, వీలైనం త్వరగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తాము పని చేస్తున్నామని వివరించింది. అంతరాయానికి క్షమాపణలు పేర్కొంది.
ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలను మాత్రం సంస్థ పేర్కొనలేదు. కొందరేమో ఇది ఒక బగ్ కారణంగా జరిగిందని తెలుపుతున్నారు. మెటా సంస్థ ఈ బగ్‌ను గుర్తించినప్పటికీ, ఇదే కారణమని ధ్రువీకరించలేదు.