ఢిల్లీలో మరో కోల్డ్ స్పెల్... నేటినుంచి రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు..

By SumaBala BukkaFirst Published Jan 16, 2023, 7:29 AM IST
Highlights

ఢిల్లీలో నేటినుంచి మూడు రోజులపాటు చలి తీవ్రంగా విపరీతంగా పెరగనుంది. దీంతో మరో కోల్డ్ స్పెల్ గా వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు  చలి తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశముంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. ఐఎండి నివేదిక ప్రకారం ఢిల్లీలో మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కొద్దిరోజుల పాటు వరుసగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని కోల్డ్ స్పెల్ గా వ్యవహరిస్తారు.

జనవరి 5 నుంచి 9 తేదీల మధ్య అలాంటి కోల్డ్ స్పెల్ ఏర్పడింది. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి. తాజాగా ఐఎండి తెలిపిన వివరాల ప్రకారం గత 15 రోజుల్లో 50 గంటల పాటు ఢిల్లీలో పొగమంచు కురిసింది. ఇంత పెద్దమొత్తంలో మంచు కురవడం 2019 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి. ఆ తర్వాత ఈ నెల 10 నుంచి క్రమంగా కొంత ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ, వాయువ్య ప్రాంతం నుంచి వస్తున్న గాలులతో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. 

ఢిల్లీలో షాకింగ్.. వ్యక్తిని చంపి,శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి..వీడియో తీసి, పాకిస్థాన్ కు...

ఇక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలతో పాటు ఢిల్లీలో రానున్న ఐదురోజుల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా ఐఎండి తెలిపింది. జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండి తెలిపింది. దీనికి కారణం వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలు లేనని తెలిపింది. ఈ వాతావరణ మార్పులతో తాజా వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా  ఉండాలని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది. 

వదులుగా, పొరలు పొరలుగా ఉండే దుస్తులను ధరించాలని అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని తెలిపింది. పిల్లలు కూడా ఉష్ణోగ్రతలు మరీ పడిపోకుండా ఉండడానికి వీలుగా రూమ్ హీటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. జనవరి 18 తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.

click me!