వారణాసిలో ప్రధాని మోడీ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
వారణాసి : ఉత్తర ప్రదేశ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయని ... ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రముఖ ఆద్యాత్మిక నగరం కాశీలో గత పదేళ్లలో 44 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో 34 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి...మరో 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని సీఎం యోగి తెలిపారు. వీటికితోడు దీపావళికి ముందు కాశీ ప్రజలకు మరో 3200 కోట్ల రూపాయల ప్రాజెక్టుల కానుక లభిస్తున్నాయని యోగి తెలిపారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరిగిన ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు యోగి.
ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం అదృష్టమని అన్నారు. తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ గత 10 సంవత్సరాల్లో కాశీ నగరం సరికొత్త రూపురేఖలను సంతరించుకుందని... దీన్ని కేవలం దేశమే కాదు ప్రపంచం మొత్తం చూస్తోందని యోగి అన్నారు.
గత పదేళ్లలో మారుతున్న భారతాన్ని చూస్తున్నామని... 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' సాకారం అవుతోందని సీఎం యోగి అన్నారు. రోడ్డు, విమానయానం, జలమార్గాలు, రైల్వే, మెట్రో, బుల్లెట్ రైలు... ఇలా ప్రతి రంగంలోనూ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. దీపావళికి ముందు ప్రధాని చేతుల మీదుగా కాశీ, ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలకు 6700 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టుల బహుమతిగా లభిస్తున్నాయని అన్నారు.
హర్యానా బిజెపి విజయంపై యోగి కామెంట్స్ :
హర్యానాలో బిజెపి ఘన విజయంపై సీఎం యోగి ప్రధానికి అభినందనలు తెలిపారు. వారణాసిలో కొత్త విమానాశ్రయ టెర్మినల్ భవనం, ఆగ్రాలో కొత్త విమానాశ్రయం శంకుస్థాపన, సహారన్‌పూర్‌లోని సర్సావా విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందన్పారు. ఈ సందర్భంగా సహారన్‌పూర్, ఆగ్రా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, యోగి ప్రభుత్వంలోని మంత్రులు సురేష్ ఖన్నా, అనిల్ రాజ్‌భర్, రవీంద్ర జైస్వాల్, గిరీష్ చంద్ర యాదవ్, దయాశంకర్ మిశ్ర 'దయాళు', మేయర్ అశోక్ తివారీ, ఎమ్మెల్యేలు నీలకంఠ్ తివారీ, సౌరభ్ శ్రీవాస్తవ్, టి. రామ్, డాక్టర్ అవధేష్ సింగ్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పూనమ్ మౌర్య, విధాన పరిషత్ సభ్యుడు హన్స్‌రాజ్ విశ్వకర్మ తదితరులు పాల్గొన్నారు.