ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురలో బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి, అభివృద్ధి పనులను సమీక్షించారు. అధికారులు అయోధ్య, కాశీలను సందర్శించి అభివృద్ధిలో కొత్త ఆలోచనలు తెలుసుకోవాలని ఆదేశించారు.
మథుర : ఉత్తర ప్రదేశ్ లోని ఆద్యాత్మిక నగరం మథుర అభివృద్దికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలు చేపట్టారు. బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ ఏడవ బోర్డు సమావేశం కోసం ఆయన ముథురలో పర్యటించారు. ఈ సందర్భంగా మథురలో జరుగుతున్న అభివృద్ధి పనులు, శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు బ్రజ్ తీర్థ్ పథ్ ప్రాజెక్ట్, మథుర-వృందావన్‌లో గోవర్ధన్ కనెక్ట్ ప్రాజెక్ట్, మథుర-వృందావన్ రైలు-బస్సు మార్గంలో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల అభివృద్ధి, యమునా ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా మథురలో రాయా అర్బన్ నోడ్ అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
మథుర జిల్లాలో సమగ్రాభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అధికారుల బృందం అయోధ్య, కాశీలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి మెరుగైన రోడ్లు, రైళ్లు, రోప్‌వే, వాటర్‌వే వంటివి అనుసంధానించాలని సూచించారు. శ్రీకృష్ణ జన్మస్థలాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులకు తగిన పార్కింగ్, మంచి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండాలన్నారు. పురాతన ప్రదేశాల పునరుద్ధరణకు సామాజిక సేవకుల సహాయం తీసుకోవాలి.
undefined
యమునా నది నీటి శుద్దీకరణకు తగిన చర్యలు తీసుకోవాలి. మురుగునీరు నేరుగా యమునా నదిలోకి వెళ్లకుండా చూడాలన్నారు. అప్పుడే ఈ నదిలో నీరు శుభ్రంగా వుంటాయి... పరిసరాలు ఆహ్లాదకరంగా మారతాయన్నారు. యమునా నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు ప్రజలపైనా వుందన్నారు సీఎం యోగి.
మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలని...: శిలా ఫలకాలపై ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు తప్పకుండా ఉండాలన్నారు. ఐజీఆర్ఎస్, సీఎం హెల్ప్‌లైన్‌లలో ఫేక్ క్లోజర్లు చేయవద్దు... ఇలా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ కింద దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు సకాలంలో చేయకపోతే ఆ సంస్థతో పాటు జల్ జీవన్ మిషన్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రమాదాలు జరిగితే సంబంధిత సంస్థ, శాఖను బాధ్యులను చేయాలన్నారు. ఇక భద్రత కోసం పోలీసులు కాలినడకన, మోటార్ సైకిళ్లపై పెట్రోలింగ్ పెంచాలని సూచించారు..
ఉత్తరప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ ఏడవ బోర్డు సమావేశంలో రూ.133 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులివి. వృందావన్‌లో ఇప్పటికే నిర్మించిన టీఎఫ్సీ విస్తరణ ప్రాజెక్ట్ (రూ.35 కోట్లు), వృందావన్‌లో టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ సమీపంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ (రూ.38 కోట్లు), మథురలో యమునా నది పరిసరాల్లోని విశ్రాంతి ఘాట్ నుంచి కేసీ ఘాట్ వరకు 6 ప్రదేశాల్లో ఆఫ్‌షోర్/తీరప్రాంత సౌకర్యాల అభివృద్ధి (రూ.8 కోట్లు) కేటాయించారు.
బర్సానలో రాధా బిహారీ ఇంటర్ కాలేజీ స్థలంలో టీఎఫ్సీ నిర్మాణం-2 (రూ.27 కోట్లు), వృందావన్‌లో యమునా నది కుడి ఒడ్డున అకూర్ ఘాట్ నిర్మాణం (రూ.7.60 కోట్లు), మథురలో 150 హెక్టార్లలో పురాతన అడవుల పునరుద్ధరణ (రూ.6 కోట్లు), రొకౌలీ గ్రామంలో పర్యావరణ పునరుద్ధరణకు ఫెన్సింగ్ (రూ.2 కోట్లు), మథుర, వృందావన్ మధ్య ఆడిటోరియం నిర్మాణం (రూ.43.04 కోట్లు) కేటాయించారు.
మథుర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల చౌముహా, సైన్స్ ల్యాబ్‌లు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మిషన్ సుపోషన్-100 మొదటి దశ జూలై 2023లో 599 మంది పిల్లలను గుర్తించగా, 594 మందికి పోషకాహారం అందించామన్నారు. ఇక రెండో దశలో జూలై 2024లో 645 మంది పిల్లలను ఎంపిక చేయగా, 642 మంది పిల్లలను పోషకాహార లోపం నుంచి బయటపడేసినట్లు తెలిపారు.
85 అంగన్‌వాడీ కేంద్రాలను లెర్నింగ్ ల్యాబ్‌లుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాలు బ్రజ్ ఉదయ్ పేరుతో ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఈ ఉత్పత్తులను తాజ్‌మహల్ తూర్పు గేటు వద్ద తాత్కాలిక దుకాణం, మండలంలోని ప్రధాన హోటళ్లు, ఎంపోరియం, టీఎఫ్సీ వృందావన్, ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు.
జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ నీళ్లు అందించేందుకు నమామి గంగే, గ్రామీణ నీటి సరఫరా పథకాల కింద పనులు జరుగుతున్నాయని తెలిపారు. పల్వల్ బులంద్‌షహర్‌లోని అప్పర్ గంగా కెనాల్ నుంచి 225 ఎమ్ఎల్డి నీటిని తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పథకం కింద 214 ట్యాంకులు నిర్మిస్తుండగా, 133 ట్యాంకుల నిర్మాణం జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు.
ఇక వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే డీఏపీ, యూరియా, ఎన్పీకే, ఎంఓపీ డిమాండ్ గురించి ముఖ్యమంత్రి ఆరాతీశారు. డీఏపీ కృత్రిమ కొరతను అరికట్టాలని, రైతులకు అవసరమైన డీఏపీని అందించాలని సూచించారు. ఇందుకోసం అధికారులు వీటి అమ్మే కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు.
నవంబర్ 15 నాటికి కాలువల్లో నీళ్లు వదలాలని, సిల్ట్ తొలగింపు పనులు సకాలంలో పూర్తి చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల దెబ్బతిన్న ఇళ్లు, పంటలకు నష్టపరిహారం సకాలంలో చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
జిల్లాలో లోక్ నిర్మాణ శాఖ దాదాపు 1058.695 కోట్ల రూపాయలతో 616 పనులు చేపట్టనుంది. మథుర-వృందావన్ డెవలప్‌మెంట్ అథారిటీ హనుమాన్ విహార్, గోవింద్ విహార్ హౌసింగ్ స్కీమ్‌లను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి పట్టణ విస్తరణ, కొత్త నగర ప్రోత్సాహక పథకం కింద రహీంపూర్ ఫరా, ఛాతాలో టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి సంస్థలు ఎన్ఓసీ, ప్లాన్‌లను సకాలంలో మంజూరు చేయాలని ముఖ్యమంత్రి మథుర-వృందావన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌ను ఆదేశించారు.
ఐటీఎంఎస్, మల్టీలెవెల్ కార్ పార్కింగ్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, స్వచ్ఛ్ భారత్ మిషన్ గురించి మున్సిపల్ కార్పొరేషన్ సీఎం యోగికి వివరించారు. 20 కూడళ్లలో ఐటీఎంఎస్ పనిచేస్తోందని మున్సిపల్ కమిషనర్ శశాంక్ చౌదరి తెలిపారు. సేఫ్ సిటీ కింద 22 వేలు, సేఫ్ సిటీ కార్ప్ కింద 15 వేల కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అయితే అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో నిరంతరం తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
శాంతి భద్రతలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. రాబోయే పండుగల సందర్భంగా భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్ఎస్పీ శైలేష్ కుమార్ పాండే వివరించారు. అక్టోబర్ 24న రాధాకుండ్‌లో అహోయి అష్టమి, అక్టోబర్ 29న ధనత్రయోదశి, 30న నరక చతుర్దశి, 31న దీపావళి, నవంబర్ 2న గోవర్ధన్ పూజ, 3న భయ్యాదూజ్, 7న చాట్ పూజ జరుపుకుంటారు. పండుగలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
గ్యాంగ్‌స్టర్ చట్టం కింద 38 కేసుల్లో 136 మందిని అరెస్ట్ చేసి, 106 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశామని ఎస్ఎస్పీ సీఎంకు తెలిపారు. గూండా చట్టం కింద 468 కేసుల్లో 154 మందిని బహిష్కరించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నలుగురిని అరెస్ట్ చేశారు. 35 మంది హిస్టరీషీటర్లపై చర్యలు తీసుకున్నారు. 42 కొత్త హిస్టరీషీట్లు తెరిచారు. రెండు ముఠాలకు చెందిన 12 మందిని అరెస్ట్ చేసి, రెండు కొత్త ముఠాలను నమోదు చేశారమని వివరించారు.
పశువుల వధ నిషేధ చట్టం కింద 13 కేసుల్లో 27 మందిని అరెస్ట్ చేసి, 92 పశువులను విడిపించామని ఏఎస్పి వివరించారు. 17 మందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద చర్యలు తీసుకుని, 8 మంది హిస్టరీషీట్లు తెరిచారు. ఆయుధాల చట్టం కింద 846 కేసుల్లో 557 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 7 ఆయుధాల తయారీ కేంద్రాల్లో 13 మందిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ చట్టం కింద 990 కేసుల్లో 1032 మందిని అరెస్ట్ చేసి, 60 వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఎంకు తెలిపారు.
2024లో 75 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో ఇద్దరు మృతి చెందగా, 145 మంది గాయపడ్డారని తెలిపారు. షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ, అత్యాచార కేసులో 50 వేల రూపాయల బహుమతితో ఉన్న ఉత్తమ్ అలియాస్ మనోజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ,హత్య కేసులో లక్ష రూపాయల బహుమతితో ఉన్న పంకజ్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడన్నారు.
నకిలీ ఈడీ కేసులో 14 మందిని అరెస్ట్ చేయగా, ఇద్దరు గాయపడ్డారని సీఎంకు తెలియజేసారు. ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు... కానీ 24 గంటల్లో బాలుడిని విడిపించినట్లు తెలిపారు.బాంకే బిహారీజీ ఆలయంలో జనసమూహాల నియంత్రణ, భద్రతా ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి ఆరాతీశారు. భద్రత కోసం జోన్, రేంజ్ నుంచి అదనపు బలగాలను మోహరించామని ఎస్ఎస్పీ తెలిపారు.
ఇక మథుర జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. చాలా గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని క్యాబినెట్ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి అన్నారు. కాలువల్లో సిల్ట్ తొలగించి, రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ యోగేష్ నౌహ్వార్ అన్నారు. జైపూర్-బరేలీ హైవేపై సర్వీస్ రోడ్డు, అండర్‌పాస్ నిర్మించాలని మాంట్ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి కోరారు.
నగరంలో పారిశుధ్యం, ట్రాఫిక్, ఆక్రమణలపై దృష్టి సారించాలని సదర్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ అన్నారు. గ్రామాల్లో నీరు నిలిచిపోవడం, మురుగు కాలువల శుభ్రత లేకపోవడంపై జిల్లా పరిషత్ చైర్మన్ కిషన్ సింగ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా నిర్మించిన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని త్వరగా ప్రారంభించాలని, మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిసిన గోవర్ధన్ గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే మేఘశ్యామ్ సింగ్ సూచించారు.
సమావేశంలో విధాన పరిషత్ సభ్యుడు ఓంప్రకాష్ సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (పర్యాటకం, సాంస్కృతిక శాఖ) ముకేష్ కుమార్ మేశ్రామ్, కమిషనర్ రితు మహేశ్వరి, సీఈఓ శ్యామ్ బహదూర్ సింగ్, సీడీఓ మనీష్ మీనా, డీఎఫ్ఓ రజనీకాంత్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.