ప్రధానికే సెక్యూరిటీ ఇవ్వలేని సీఎం.. రాష్ట్రానికి భద్రత ఇవ్వగలడా?: చన్నీపై అమిత్ షా దాడి

Published : Feb 13, 2022, 04:03 PM ISTUpdated : Feb 13, 2022, 04:04 PM IST
ప్రధానికే సెక్యూరిటీ ఇవ్వలేని సీఎం.. రాష్ట్రానికి భద్రత ఇవ్వగలడా?: చన్నీపై అమిత్ షా దాడి

సారాంశం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రికే సెక్యూర్ రూట్ కల్పించలేకపోయిన సీఎం.. రాష్ట్రాన్ని సురక్షితంగా చూసుకోగలడా? అని ప్రశ్నించారు. తమకు అధికారం ఇస్తే.. రాష్ట్రంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బ్రాంచ్‌లను నాలుగు నగరాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

చండీగడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ రోజు లూధియానాలో మాట్లాడుతూ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన సీఎం అభ్యర్థి, ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని టార్గెట్ చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ కూడా సరిగా ఇవ్వలేని సీఎం చన్నీ పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాన్ని భద్రంగా చూసుకోగలడా? అని ప్రశ్నించారు.

సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పంజాబ్ రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారని అమిత్ షా అన్నారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కనీసం సెక్యూర్ రూట్‌ను ఇవ్వలేకపోయిన సీఎం.. పంజాబ్ రాష్ట్రాన్ని సురక్షితంగా చూసుకోగలడా? అని ప్రశ్నించారు. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల బెడద ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఆ రాష్ట్ర ప్రజలకు ఓ ఆఫర్ ఇచ్చారు. తమకు రాష్ట్రంలో అధికారం ఇస్తే.. రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి జిల్లాలో ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

ఈ ఏడాది జనవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు. ఆయన ఫెరోజ్‌పూర్‌లోని బీజేపీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నది. భటిండా ఎయిర్‌పోర్టు నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫెరోజ్‌పూర్‌కు వెళ్లాలి. కానీ, అనుకూలించని వాతావరణం మూలంగా ఆ ప్లాన్ చేంజ్ చేశారు. రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో ఆయన ఫెరోజ్‌పూర్‌కు బయల్దేరారు. కానీ, ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తు రైతులు కొందరు అదే రోడ్డుపై ఆందోళనలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రధాని మోడీ కాన్వాయ్ మధ్యలోని ఓ ఫ్లై ఓవర్‌పై సుమారు 20 నిమిషాలు అటకాయించి పోయారు. ఈ సెక్యూరిటీ వైఫల్యంతో ప్రధాని మోడీ కాన్వాయ్ ముందుకు కదల్లేదు. మళ్లీ వెనక్కే వెళ్లిపోయింది.

భటిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీకి భద్రతా ఇవ్వడంలో వైఫల్యం ఎదురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అంశం సుప్రీంకోర్టుకూ చేరింది. ప్రధాని నరేంద్ర మోడీకి భద్రతా వైఫల్యాన్ని విచారించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతూ ఉన్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?
India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu