
UP Assembly Election 2022: ఉత్తప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటిదశ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచి విమర్శలు, ఆరోపణల్లో పదునుపెంచి ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో రోహిల్‌ఖండ్ (Rohilkhand) ప్రాంతంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు సహా తొమ్మిది జిల్లాల్లోని యాభై ఐదు స్థానాలకు సోమవారం రెండవ దశ ఎన్నికల పోలింగ్ (second phase elections) జరగనుంది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ ఎన్నికలు సహరాన్‌పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్‌పూర్‌లో విస్తరించి ఉన్న స్థానాలతో పోలింగ్ జరగనుంది. 55 స్థానాలకు మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు పేర్కొన్నారు. రెండో దశలో ఎన్నికలు జరగనున్న 55 స్థానాల్లో 2017లో బీజేపీ (BJP) 38 స్థానాల్లో గెలుపొందగా, సమాజ్‌వాదీ పార్టీ (SP) 15, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఎస్పీ గెలుచుకున్న 15 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో బరేల్వి, దేవ్‌బంద్ వర్గాలకు చెందిన మత పెద్దల ప్రభావం చూపే గణనీయమైన ముస్లిం జనాభాను కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతాలు సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటలుగా పరిగణించబడుతున్నాయి.
ఎస్పీ (Samajwadi Party) నేత మహమ్మద్ ఆజం ఖాన్తో పాటు ధరమ్ సింగ్ సైనీ, యూపీ ఫైనాన్స్ మినిస్టర్ సురేశ్ ఖన్నాఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆజంఖాన్ రాంపూర్ సీటు నుంచి పోటీ చేస్తుండగా.. సురేశ్ ఖన్నా షాజహాన్ పూర్, సైనీ నకుడ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నారు. ఆజం ఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం స్వర్ స్థానం నుంచి పోటీలో నిలిచారు. ఇదే స్థానం నుంచి బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్ (సోనేలాల్) నుంచి రాంపూర్ నవాబ్‌లు, మరొక రాజకీయ కుటుంబ వారసుడు హైదర్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. హైదర్ అలీ ఖాన్ మాజీ ఎంపీ నూర్ బానో మనవడు. ఇక బిలాస్‌పూర్ నుంచి జల్‌శక్తి సహాయ మంత్రి బల్‌దేవ్ సింగ్ ఔలాఖ్, బదౌన్ నుంచి పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మహేశ్ చంద్ర గుప్తా, చందౌసీ నుంచి సెకండరీ విద్యాశాఖ సహాయ మంత్రి గులాబ్ దేవి కూడా ఎన్నికల బరిలో నిలిచారు. బరేలీ మాజీ మేయర్ సుప్రియా ఆరోన్ సమాజ్ వాదీ పార్టీలో చేరిన తర్వాత బరేలీ కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు.
రెండో దశలో అధికంగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలు ఉండటంతో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రిపుల్ తలాక్, ముస్లిం మహిళల కోసం తీసుకువచ్చిన పథకాలను గురించి ప్రస్తావించారు. ఎస్పీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యతిరేకులను, అల్లర్లు సృష్టించే వారిని ఎన్నికల బరిలో నిలిపారని ఆరోపించారు. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అఖిలేష్ యాదవ్.. వర్సిటీ కట్టినందుకు ఆజంఖాన్ జైల్లో పెట్టారు.. రైతులను చంపిన మంత్రి కుమారుడిని జైలు నుంచి బయటకు పంపారు అంటూ విమర్శలు గుప్పించారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ప్రభుత్వం జాతవ్-ముస్లిం సోదరభావాన్ని అంతం చేసిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మహిళా సంక్షేమంపై తన ప్రచారాన్ని కేంద్రీకరించారు.