దేశ రాజధానిలో ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వరదలాంటి పరిస్థితే ఎదురైతే దానిని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. అయితే వరదలాంటి పరిస్థితి వస్తే దానిని ఎదుర్కునేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యమునా నదిలో నీటిమట్టం 206 మీటర్లు దాటితే ప్రజలను తరలించే ప్రణాళికను అమలు చేస్తామని సీఎం చెప్పారు.
రాజ్యసభ ఎన్నికలు.. గుజరాత్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
ప్రజలను రక్షించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, పరిస్థితిని ఎదుర్కోవడానికి యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. అవసరమైతే ఢిల్లీ ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుందని చెప్పారు. మంగళవారం ఉదయానికల్లా యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటుతుందని ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి అతిషి హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
| CM Arvind Kejriwal says flood-like situation unlikely in Delhi, government prepared. pic.twitter.com/T5bFdjLQD8
— ANI (@ANI)‘‘యమునా నదిలో నీటి మట్టం ఇప్పటికే ప్రమాద స్థాయిని దాటింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 204.63 మీటర్లకు చేరింది. డేంజర్ మార్క్ - 204.50. వరదలాంటి పరిస్థితి తలెత్తినా రాజధాని సిద్ధంగా ఉంది.’’ అని కేజ్రీవాల్ తెలిపారు. ‘‘సీడబ్ల్యూసీ ప్రకారం.. ఢిల్లీలో యమునా నది 203.58 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. రేపు ఉదయం 205.5 మీటర్లకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే వాతావరణ అంచనాల ప్రకారం, యమునాలో నీటి మట్టం చాలా ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. వరద లాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదు. యమునా నది 206 మీటర్ల మార్కును దాటితే, మేము నది ఒడ్డున తరలింపు ప్రారంభిస్తాము’’ అని కేజ్రీవాల్ చెప్పారు.
యమునా నీటి మట్టాలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర జలసంఘంతో సంప్రదింపులు జరుపుతున్నామని, వరదలాంటి పరిస్థితి తలెత్తదని వారి అంచనాలు సూచిస్తున్నాయని ఢిల్లీ సీఎం అన్నారు. ఇది ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకునే సమయం కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అన్ని ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇళ్లలో పాచి పని చేస్తూ భర్తను చదివించిన భార్య.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక మరో యువతితో కలిసి ఉంటూ..
న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రాంతాల్లో నీరు నిలవడం ఇదే తొలిసారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అక్కడ కొన్ని రోడ్లు కూడా కుంగిపోయాయని, దీనికి కారణాలు కనుక్కోవాలని అధికారులను కోరామని ఆయన అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్లపై గుంతలను రాళ్లతో నింపుతామని, నీటి సమస్యలను పరిష్కరించాలని ఎన్డీఎంసీని కోరినట్లు తెలిపారు. కనీవినీ ఎరుగని వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, ఢిల్లీ వ్యవస్థ తట్టుకోలేకపోయిందన్నారు. ప్రతీ సంవత్సరం వర్షాలు కురిసిన తరువాత, కొన్ని సున్నితమైన ప్రాంతాలు జలమయం అవుతాయని, కొన్ని గంటల్లో నీరు బయటకు పోతుందని చెప్పారు. కానీ 153 మిల్లీమీటర్ల వర్షపాతం కురసిందని, 40 ఏళ్లలో ఇంతలా ఎప్పుడు వానపడలేదని అన్నారు.