
ఆమె ఓ వివాహిత. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. అయితే ఇటీవల భర్తతో గొడవలు కావడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. రోజులాగే తన బ్యూటీ పార్లర్ లో పని ముగించుకొని ఇంటికి బయలుదేరేంది. అయితే కొంత సమయానికే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో శుక్రవారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడులోని పుట్లూరుకు చెందిన దివ్య (30)కు కొనేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నారు. దివ్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల భర్తతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో రెండు ఇద్దరూ విడి విడిగా ఉంటున్నారు. ఇంటికి దూరంగా ఉంటూ దివ్య బ్యూటీ పార్లర్ కు వెళ్తోంది. ఎప్పటిలాగే బ్యూటీ పార్లర్ ను శుక్రవారం రాత్రి 9 గంటలకు క్లోజ్ చేసింది. అనంతరం ఆమె నివసిస్తున్న ప్రాంతానికి బయలుదేరింది. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో 20 నిమిషాల పాటు మొబైల్ లో మాట్లాడింది. అయితే ఆ సమయంలో ఆ ట్రాక్ పై ఓ ట్రైన్ వస్తోంది. దీనిని గమనించిన దివ్య తన స్కూటీతో ఆ ట్రైన్ కు ఎదురుగా వెళ్లింది. ఆ ట్రైన్ వేగంగా స్కూటీని ఢీకొట్టడంతో ఆమె అక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కర్నాటకలో ఆస్తి కోసం అల్లుడిని చిత్రహింసలు పెట్టడంతో ఆ వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్ళాపుర తోటహళ్లికి చెందిన ఆనంద్ కుమార్-నీలమ్మ భార్యా భర్తలు. ఆనంద్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయి సంసారాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడ అతడిపేరిట వున్న ఆస్తిని నాశనం చేస్తాడోనని భార్యా, అత్తింటివారు భయపడిపోయారు. ఈ క్రమంలోనే అతడి పేరిట వున్న ఆస్తిని భార్య నీలమ్మ పేరిట మార్చాలని ఒత్తిడి తెచ్చారు. ఇలా భార్య నీలమ్మతో పాటు అత్త గంగమ్మ, బామ్మర్ది గంగరాజు ఆస్తి గురించి ఆనంద్ పై ఒత్తిడి తీసుకురావడమే కాదు గదిలో బంధించి శారీరకంగా హింసించడం ప్రారంభించారు. ఈ వేధింపులను తట్టుకోలేక ఆనంద్ దారుణానికి ఒడిగట్టాడు. తన ఆత్మహత్య కు గల కారణాలను లెటర్ లో పేర్కొన్నాడు ఆనంద్. అత్తింటి వారి వేధింపులే తన చావుకు కారణమని అందులో చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.