
న్యూఢిల్లీ: రాజద్రోహ చట్టాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తల గళాలను నొక్కేయడానికి ప్రభుత్వాలు వీటిని ఆయుధాలుగా వాడుతున్నాయనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అదీగాక, ఇది వలసవాద కాలం నాటి చట్టం అని, మన ఫ్రీడమ్ ఫైటర్ల మీద మోపిన ఈ చట్టాన్ని ఇంకా కొనసాగించడం అవసరమా? అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజద్రోహ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తున్నది.
రాజద్రోహ చట్ట సమీక్షకు ఎంత కాలం తీసుకుంటారని సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. రాజద్రోహ చట్ట సమీక్షను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని వివరించారు. కానీ, ఈ సమీక్షకు ఎంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే న్యాయస్థానానికి ఇది అర్థం అవుతుందని, కేవలం విచారణ కోసం సమర్పించిన అఫిడవిట్ కాదని, నిజంగా సమీక్ష చేయాలనే ఉద్దేశంతో వేసిన అఫిడవిట్ ఇది అని తెలిపారు.
ఇదే సమయంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. రాజద్రోహ చట్టాన్ని సమీక్షకు పట్టే కాల అవధిలో ఇది వరకే పెండింగ్‌లో ఉన్న రాజద్రోహ కేసులను ఏం చేస్తారని ప్రశ్నించింది. అలాగే, ఈ సమీక్షా కాలంలో ఇలాంటి దాఖలు చేసే కేసుల పరిస్థితి ఏంటని అడిగింది. పెండింగ్ కేసుల విషయమై రేపటిలోగా కేంద్రం తమకు వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ పిటిషనర్ తరఫు వాదిస్తూ కేంద్రం ఒక వేళ చట్టాన్ని మార్చాలని భావిస్తే.. ప్రస్తుతం పెండింగ్‌లో, విచారణ జరుగుతున్న రాజద్రోహ కేసులు ఉన్నాయని అన్నారు. వాటిని ప్రస్తుత చట్ట పరిధిలోనే విచారణ చేపట్టాలని సూచిస్తున్నట్టు వివరించారు.
రాజద్రోహం అంటే సెక్షన్ 124ఏ అనేది భారత సమగ్రత, సార్వభౌమత్వం గురించి ప్రస్తావిస్తుందని, ఈ వాక్యం ఆర్టికల్ 19(2)లో ఉన్నదని కపిల్ సిబల్ అన్నారు. దేశంపై వ్యతిరేకతకు సంబంధించి సెక్షన్ 124ఏ ఉన్నదని, అది అది రాజ్యాంగం ఇంకా అమలులోకి రాకముందటి భారత్‌కు చెందినదని వివరించారు. అంటే అప్పుడు దేశం, రాష్ట్రాలు అని వేర్వేరుగా లేవని తెలిపారు. కానీ, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా ఉన్నాయని వాదించారు.
ఈ సమీక్షా సమయంలో 124ఏ సెక్షన్ కింద కొత్తగా అరెస్టు చేయకూడదని కపిల్ సిబల్ వాదించారు. వారు కొత్త చట్టాన్ని రూపొందించవచ్చునేమో గానీ, ప్రస్తుతం రాజద్రోహం కేసు నిందితుల విచారణ ఈ చట్టం కిందే చేపట్టాలని వివరించారు. వాటన్నింటినీ ఎత్తేయడం కుదరదని పేర్కొన్నారు.
ఈ సమీక్ష కాలంలో పెండింగ్ కేసుల విచారణను ఏం చేయాలి? అదే సమయంలో నమోదయ్యే కేసుల గురించి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపటి లోగా కేంద్రం ఆలోచలను సుప్రీంకోర్టుకు తెలియజేయాలని తెలిపింది