
2 groups clash outside mosque in Maharashtra: మసీదు వెలుపల రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు 45 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలో చోటుచేకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ ప్రారంభించారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని మసీదు వెలుపల మంగళవారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లోపల నమాజ్ జరుగుతుండగా మసీదు వెలుపల పెద్దగా మ్యూజిక్ ప్లే అవుతుండటంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు రెండు ఎఫ్ఐఆర్ లను నమోదు చేసి 45 మందిని అరెస్టు చేశారు.
"ఈ ప్రాంతానికి సమీపంలో వెళ్తున్న పాల్కి యాత్రపై కొందరు రాళ్లు రువ్వారు. అనంతరం జరిగిన హింసలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరుసటి రోజు ఆ ప్రాంతంలోని దుకాణాలను మూసివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉందని" జల్గావ్ పోలీసు సూపరింటెండెంట్ ఎం రాజ్ కుమార్ తెలిపారు.
మరోవైపు ఛత్రపతి శంభాజీనగర్ లోని కిరాద్ పురా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు ఆలయం వెలుపల ఉన్న పలు ప్రజా, పోలీసు వాహనాలను తగలబెట్టారు. ఇక్కడ కూడా పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.