కేసులను జాబితా చేయకపోవడంపై సీజేఐ ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్

By Rajesh KarampooriFirst Published Oct 22, 2022, 6:18 AM IST
Highlights

400 కంటే ఎక్కువ కేసులను జాబితా చేయకపోతే సీజేఐ యూయూ లలిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రతి కేసులో ఎందుకు జాబితా చేయలేదనే విషయాన్ని తెలుసుకుంటామని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
 

విచారణకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎటువంటి కారణాలు చూపకుండా 400 కేసులు జాబితా కాకపోవడంపై భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.ఇది ఆందోళన కలిగించే అంశం, తీవ్రమైన సమస్య అని అన్నారు. ఈ విధంగా విచారణ కోసం రిజిస్ట్రీ కేసులను జాబితా చేయకపోవడం న్యాయాన్ని అడ్డుకోవడం. ఈ కేసులన్నీ అక్టోబర్ 31 నుంచి లిస్ట్ అవుతాయని తెలిపారు. ఇలా ఒక్కో కేసులోనూ ఎందుకు నమోదు కాలేదో తెలుసుకుని అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


వాస్తవానికి, శుక్రవారం ఒక న్యాయవాది తన కేసు 22 సంవత్సరాలుగా విచారణలో ఉందని చెప్పారు. ఆ తర్వాత, ప్రధాన న్యాయమూర్తి, రిజిస్ట్రీ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించడానికి తేదీని నిర్ణయిస్తూ, కేసులను విచారణకు జాబితా చేయకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఎస్సీ రిజిస్ట్రీలోని ఒక విభాగం తెలియని కారణాల వల్ల అనేక కేసులను జాబితా చేయడం లేదని సీజేఐ లలిత్ బహిరంగ కోర్టుకు తెలిపారు.

సీజేఐ లలిత్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాత కేసులు, సుదీర్ఘకాలంగా విచారణకు నోచుకోని కేసులను పరిష్కరించే మార్గాలపై కసరత్తు చేస్తున్నారు. సీజేఐ చొరవ కారణంగా..చాలా సంవత్సరాల తర్వాత అనేక రాజ్యాంగ ధర్మాసనం విచారణలు జరగడం అభినందనీయమైన విషయం. నేటికీ సుప్రీంకోర్టులో 69,461 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును త్వ‌ర‌లో నూత‌న‌ ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వచ్చేనెల 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అతని స్థానంలో జస్టిస్ ధనంజయ్ యశ్వంత్  చంద్రచూడ్ నవంబర్ 9వ తేదీన కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేశారు.

ఈ మేరకు సంబంధించిన అధికారిక లేఖను సీనియ‌ర్ జస్టిస్ చంద్రచూడ్ కు అందజేశారు. దీంతో సుప్రీంకోర్టు 50వ సీజేఐగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనప్రాయమే కానున్న‌ది. ఆయ‌న  2024 నవంబర్ 10వ తేదీ వరకు ప‌దవీలో కొనసాగనున్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిగా సేవ‌లందిస్తున్నారు.

click me!