చరిత్రలో తొలిసారి: సిట్టింగ్ జడ్జిపై సీబీఐ దర్యాప్తుకు సీజేఐ గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published Jul 31, 2019, 11:15 AM IST
Highlights

అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు. 

అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు.

2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా శుక్లా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే ఒక సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ చేపట్టాలంటే దానికి భారత ప్రధాన న్యాయమూర్తి అనుమతి తప్పనిసరి. దీంతో సీబీఐ అధికారులు సీజేఐని కలిసి విషయం చెప్పడంతో..దీనికి సానుకూలంగా స్పందించిన రంజన్ గొగోయ్ విచారణకు అనుమతించారు.

కాగా భారతదేశ చరిత్రలో ఓ సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ చేపట్టడం ఇదే తొలిసారి. అంతకు ముందు జస్టిస్ శుక్లాను పదవి నుంచి తొలగించాలని సీజేఐ.. ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లలో ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గొగోయ్ పేర్కొన్నారు.  

శుక్లా అవినీతి ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే జైస్వాల్‌లతో అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ.. నాటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.

శుక్లా తనంతట తానుగా రాజీనామా చేయాలని.. లేదంటే వీఆర్ఎస్‌ను ఎంచుకోవచ్చని మిశ్రా సూచించిన సంగతి తెలిసిందే.

click me!