
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (Justice UU Lalit) పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈ మేరకు జస్టిస్ రమణ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత.. జస్టిస్ లలిత్ దేశ తదుపరి సీజేఐగా నియమితులు కానున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ భారతదేశ 48వ సీజేగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఇక, జస్టిస్ యూయూ లలిత్ భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన 74 రోజుల పాటు పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇక, భారత ప్రధాన న్యాయమూర్తి.. తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ పేరును సిఫార్స్ చేస్తారనే సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజే ఎన్వీ రమణ తర్వాత.. జస్టిస్ యూయూ లలిత్ సీనియర్‌గా ఉన్నారు. సీనియారిటీ జాబితాలో జస్టిస్ యూయూ లలిత్ తర్వాతి స్థానంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.
జస్టిస్ లలిత్.. గతంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది. 2014 ఆగస్టు 13న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ లలిత్ భారత ప్రధాన నాయమూర్తిగా నియమితులైతే.. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు బెంచ్‌కి ఎలివేషన్ పొందిన రెండోవ సీజేఐ అవుతారు. ఇక, 1971 జనవరిలో 13వ CJIగా నియమితులైన జస్టిస్ ఎస్‌ఎం సిక్రీ ఈ కోవలో మొదటివారు. ఇక, జస్టిస్ లలిత్ తండ్రి జస్టిస్ యూఆర్ లలిత్ సీనియర్ న్యాయవాదిగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.