
జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చానని అన్నారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. శుక్రవారం ఆయనకు ఢిల్లీలో వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులో ట్రేడ్ యూనియన్‌కు నేతృత్వం వహించానని ఆయన తెలిపారు. 12 ఏళ్ల వయసులో కరెంట్ చూశానని.. వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ.. సామాన్యుడికి న్యాయం అందించడానికి కృషి చేశానని ఆయన పేర్కొన్నారు.
న్యాయవాదులకు వృత్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని.. కానీ మీరు యోధులని తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తనకు విద్య నేర్పిన గురువులు, స్పూర్తినిచ్చిన వారికి రుణపడి వుంటానని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద వృత్తి కత్తి మీద సాములాంటిదన్న జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రజాస్వామ్య విలువలు పెంచేందుకు లాయర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేశానని ఆయన పేర్కొన్నారు. తాను ఏదైనా సాధించగలిగానంటే, దాని వెనుక ఎంతో పోరాటం వుందని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు.
ALso Read:ఢిల్లీకి వెడుతున్నావ్ జాగ్రత్త.. అని భయపెట్టారు : వీడ్కోలు సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ..
మరోవైపు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రేపు లలిత్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన ఈ ఏడాది నవంబర్ వరకు భారత చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
జస్టిస్ లలిత్ గురించి..
జస్టిస్ యూయూ లలిత్ 1957 నవంబర్ 9వ తేదీన జన్మించారు. ఆయన లీగల్ కెరీర్‌ను 1983లో ప్రారంభించారు. 1985 డిసెంబర్ వరకు ఆయన బాంబే హైకోర్టులో పని చేశారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. 2004లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా అపాయింట్ చేసింది.
సీబీఐకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆయన సేవలు అందించారు. అనంతరం, బార్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.