చెరువు అభివృద్ధి పేరిట చెట్లు నరకడాన్ని ఆపాలి : నమ్మబెంగళూరు ఫౌండేషన్

By team teluguFirst Published Jun 24, 2021, 8:15 AM IST
Highlights

బెంగళూరులోని సింగనాయకనహళ్లి చెరువు చుట్టూ ఉన్న 6వేల పైచిలుకు చెట్లను నరికివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నమ్మ బెంగళూరు ఫౌండేషన్ డిమాండ్ చేసింది. 

బెంగళూరులోని సింగనాయకనహళ్లి చెరువు చుట్టూ ఉన్న 6వేల పైచిలుకు చెట్లను నరికివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నమ్మ బెంగళూరు ఫౌండేషన్ డిమాండ్ చేసింది. 

సింగనాయకనహళ్లి చెరువు చుట్టూ ఉన్న 6వేల పైచిలుకు చెట్లు గుబురుగా పెరిగి ఒక దట్టమైన అడవిని తలపిస్తుందని, అక్కడ నెమళ్లతో సహా అనేక అరుదైన వన్యప్రాణులు నివసిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. 

ఆ చెరువును అనుకోని ఏర్పడ్డ పచ్చిక బైళ్ళలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ పశువులను కాయడానికి తీసుకొస్తున్నారని, ఆ చెట్లను నరికితే వైవిధ్యమైన జీవజాలాన్ని కోల్పోవడంతోపాటుగా ప్రజలు తమ జీవనాధారాన్ని కూడా కోల్పోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. 

నమ్మబెంగళూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లారు. ప్రభుత్వం అక్కడి ప్రజలతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకుందని వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 

సింగనాయకనహళ్లి చెరువును చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులను నింపేందుకు, సాగునీటిని అందించడానికి ఫీడెర్ చెరువుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ చెట్లను నరికివేయడానికి ఆదేశించింది. 

దాదాపు 25- 30 సంవత్సరాల వయసున్న ఈ చెట్లు ఎన్నో పక్షులకు, అరుదైన జీవజాతులు ఆలవాలంగా మారిందని, చెరువును అభివృద్ధి చేయడాన్ని తాము హర్షిస్తున్నప్పటికీ... అభివృద్ధి పేరిట ఈ దట్టమైన అడవిలాంటి ప్రాంతాన్ని నాశనం చేయడాన్ని మాత్రం ఒప్పుకోబోమని వారు స్పష్టం చేసారు. 

అటవీశాఖ కూడా ఈ ప్రాంతం వైవిధ్యతను గమనించి ఇక్కడ కొన్ని మొక్కలు నాటిందని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ చెరువు చుట్టూ ఉన్న 6316 చెట్లను గనుక నరికితే అది పర్యావరణాన్ని నాశనం చేయడమే అని, అటవీశాఖాధికారులు ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొని దీన్ని అడ్డుకోవాలని వారు డిమాండ్ చేసారు. 

click me!