చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌.. గుజరాత్‌లో నమోదు

By Mahesh KFirst Published Dec 22, 2022, 4:44 PM IST
Highlights

చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. 34 ఏళ్ల బిజినెస్ మ్యాన్ చైనాలో పర్యటించి డిసెంబర్ 19వ తేదీన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు వచ్చారు. అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతని శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం గాంధీనగర్‌కు పంపారు.
 

అహ్మదాబాద్: మూడేళ్ల క్రితం చైనా అంటే.. కరోనా వైరస్ అని భయాందోళనలకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ చైనాలో కేసుల పెరుగుదలతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ ఎత్తేయడంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ సృష్టిస్తున్న బీభత్సంతో అన్ని దేశాలూ బెంబేలెత్తిపోతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి సూచనగా వేరియంట్లను ట్రాక్ చేయాలని సూచనలు చేసింది. తాజాగా, ఆ చైనా నుంచి వచ్చిన వ్యక్తికే కరోనా పాజిటివ్ అని తేలింది.

గుజరాత్‌ భావ్‌నగర్ నివాసి ఒకరు చైనా వెళ్లారు. 34 ఏళ్ల బిజినెస్ మ్యాన్ తన వర్క్ పర్పస్ చైనా వెళ్లి డిసెంబర్ 19వ తేదీన భావ్‌నగర్‌కు తిరిగివచ్చారు. ఇక్కడ ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన శాంపిల్‌ను గాంధీనగర్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్‌లో అతనికి సోకిన వైరస్ వేరియంట్‌ను కనుగొంటారు.

విదేశాల నుంచి వచ్చిన వారందరికీ కచ్చితంగా కరోనా టెస్టులు చేయాలని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే భావ్‌నగర్ కార్పొరేషణ్ టెస్టుల సంఖ్యను పెంచింది.

ఇప్పటి వరకు మన దేశంలో నాలుగు బీఎఫ్.7 కేసులు రిపోర్ట్ అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఒమిక్రాన్ నుంచి పరిణామం చెందిన వేరియంట్లు చాలా ఉన్నాయి. అందులో బీఏ.2, బీఏ.5 వేరియంట్లు మిగతా వాటికంటే బలంగా ఉన్నాయి. ఈ బీఏ.5 ఒమిక్రాన్ వేరియంట్ సబ్ లీనియేజ్ బీఏ.5.2.1.7. దీన్నే షార్ట్‌గా బీఎఫ్.7.

ఇతర కరోనా సబ్ వేరియంట్ సోకితే కనిపించే లక్షణాలే బీఎఫ్.7 సోకినా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కామన్ సింప్టమ్స్ ఇలా ఉన్నాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు, వాంతులు, డయేరియా, ఆయాసం వంటి లక్షణాలు సాధారణంగా బీఎఫ్.7 సోకితే కనిపిస్తాయి. అయితే, ఇది వరకే ఆయా వ్యాధుల బారిన పడినవారికి, వ్యాధులతో ఉన్నవారికి లేదా బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో మాత్రం లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. బీఎఫ్.7 సోకగానే ఆరోగ్యం అనూహ్యంగా క్షీణించవచ్చని చెబుతున్నారు. 

click me!