కనిపించకుండా పోయిన అరుణాచల్‌ ప్రదేశ్ యువకుడిని గుర్తించిన చైనా ఆర్మీ.. భారత్‌కు సమాచారం..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 2:28 PM IST
Highlights

కొద్ది రోజుల కిందట కనిపించకుండా పోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు (Arunachal Pradesh) చెందిన యువకుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గుర్తించినట్టుగా భారత సైన్యం (Indian Army) ఆదివారం వెల్లడించింది. 

కొద్ది రోజుల కిందట కనిపించకుండా పోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు (Arunachal Pradesh) చెందిన యువకుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గుర్తించినట్టుగా భారత సైన్యం (Indian Army) ఆదివారం వెల్లడించింది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన ప్రక్రియను చేపట్టినట్టుగా తెలిపింది.. ‘అరుణాచల్ ప్రదేశ్‌లో నుంచి తప్పిపోయిన బాలుడిని కనుగొన్నామని చైనా సైన్యం మాకు తెలియజేసింది. తగిన విధానాన్ని అనుసరిస్తోంది’ అని డిఫెన్స్ PRO, తేజ్‌పూర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన 17 ఏళ్ల మిరామ్ టారోన్‌‌ను (Miram Taron).. కొద్ది రోజుల కిదంట చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు టారోన్, మరికొంత మందితో కలిసి సరిహద్దు ప్రాంతంలో వేట సాగిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇక, మిరామ్ టారోన్‌ను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అపహరించిందని ఎంపీ తాపిర్ గావో బుధవారం ఆరోపించారు. Tsangpo river భారతదేశంలోకి ప్రవేశించే ప్రదేశానికి సమీపంలో ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు.

‘అరుణాచల్ ప్రదేశ్‌లోని లుంగ్టా జోర్ ప్రాంతం (చైనా 2018లో భారతదేశం లోపల 3-4 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది) నుంచి జనవరి 18న  Miram Taron‌ను చైనా ఆర్మీ అపహరించింది. అతని స్నేహితుడు తప్పించుకుని అధికారులకు సమాచారం ఇచ్చాడు’ అని Tapir Gao ట్వీట్ చేశారు. అతడి విడుదల కోసం భారత ప్రభుత్వంలోని అన్ని ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని ఎంపీ అభ్యర్థించారు. 

 

The Chinese Army has communicated to us that they have found a missing boy from Arunachal Pradesh and the due procedure is being followed: PRO Defence, Tezpur Lt Col Harshvardhan Pandey

— ANI (@ANI)

ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అదృశ్యమైన యువకుడి కోసం చైనా ఆర్మీతో హాట్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టుగా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. యువకుడి ఆచూకీ గుర్తించి ప్రోటోకాల్ ప్రకారం అతడికి భారత్‌కు అప్పగించాలని చైనా ఆర్మీనికి కోరినట్టుగా తెలిపాయి. 

మిరామ్ టారోన్ అదృశ్యం కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. గ‌ణ‌తంత్ర‌దినోత్స‌వానికి కొద్ది రోజుల ముందు జ‌రిగిన ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మిరామ్ కుటుంబానికి తాము అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. ఈ ఘటనపై ప్ర‌ధాని మోడీ మౌనంగా ఉండ‌టం త‌గ‌ద‌ని, వెంట‌నే విడిపించే ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు. 

click me!