ప్యాంగాంగ్‌పై చైనా బ్రిడ్జీ నిర్మాణం.. భారత్ దీన్ని అంగీకరించదు: పార్లమెంటులో కేంద్రం వార్నింగ్

Published : Feb 04, 2022, 08:03 PM ISTUpdated : Feb 04, 2022, 08:19 PM IST
ప్యాంగాంగ్‌పై చైనా బ్రిడ్జీ నిర్మాణం.. భారత్ దీన్ని అంగీకరించదు: పార్లమెంటులో కేంద్రం వార్నింగ్

సారాంశం

తూర్పు లడాఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటులో తెలిపింది. ఈ భూభాగాన్ని చైనా 1962 నుంచి అక్రమంగా అధీనంలో ఉంచుకుంటున్నదని, భారత్ ఇప్పటి వరకు ఈ ఆక్రమణను అంగీకరించలేదని స్పష్టం చేసింది. వేరే దేశాలు భారత సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని తెలిపింది.  

న్యూఢిల్లీ: గాల్వన్ లోయ(Galwan Valley)లో భారత్, చైనా(China) బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ఇప్పటికీ ఇంకా శాంతి స్థిరత్వం నెలకొనలేదు. అందుకోసం చాలాసార్లు మిలిటరీ, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. నోరు ఒకటి మాట్లాడితే నొసలు ఇంకోటి మాట్లాడినట్టు ఒక వైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు కవ్వింపులకు దిగుతున్నది. తాజాగా, ఈ కవ్వింపులపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు(Parliament)లో స్పందించింది. తూర్పు లడాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద అక్రమంగా అధీనంలో ఉంచుకుంటున్న ఏరియాలో చైనా ఓ బ్రిడ్జీ(Bridge) నిర్మిస్తున్నదని తెలిపింది. అదే సమయంలో భారత సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను ఎదుటి దేశం కచ్చితంగా గౌరవించి తీరాలని తమ దేశం ఆశిస్తున్నదని పేర్కొంది.

ప్యాంగాంగ్ సరస్సు(Pangong Lake)పై చైనా వంతెన కడుతున్న విషయాన్ని తాము గుర్తించామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపింది. 1962 నుంచి అక్రమంగా అధీనంలో ఉంచుకుంటున్న భూభాగంలో చైనా నిర్మిస్తున్నదని వివరించింది. భారత ప్రభుత్వం ఎన్నడూ ఈ ఆక్రమణను అంగీకరించలేదని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ము కశ్మీర్, లడాఖ్‌లు భారత దేశంలో అంతర్భాగాలని చాలా సార్లు కేంద్రం స్పష్టం చేసిందని, అదే సమయంలో వేరే దేశాలూ భారత సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని తెలిపింది.

అదే సమయంలో చైనా దేశం కొన్నాళ్లుగా భారత భూభాగంలోని గ్రామాల పేర్ల మార్పునూ ప్రస్తావించింది. భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల పేర్లను చైనా మారుస్తున్నట్టుగా కొన్ని వార్తలు తమ దృష్టికి వచ్చాయనీ వివరించింది. ఇది కేవలం నిరర్ధకమైన పని అని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమేనని తెలిపింది. ఈ సత్యంలో మార్పేమీ రాదని స్పష్టం చేసింది.

కాగా, గాల్వన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొడానికి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. ఈ శాంతి చర్చలపై భారత్ మూడు అంశాలను ఆధారంగా తీసుకుని వ్యవహరిస్తుందని వివరించింది. ఒకటి, ఇరువైపులా ఎల్ఏసీ సరిహద్దును గుర్తించి గౌరవించడం; రెండు, యథాతథస్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు ఇరువైపులా జరగకూడదు; మూడు; ఉభయ దేశాలూ అన్ని ఒప్పందాలను కచ్చితత్వంతో పాటించడం అని తెలిపింది.

2020లో భారత బలగాలు, చైనా పీఎల్ఏ ఆర్మీ ఎదురుబడ్డ సంగతి తెలిసిందే. పెట్రోలింగ్ గ్రూపుల మధ్య ఘర్షణ.. ఆ తర్వాత హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్టాండఫ్ నెలకొన్నప్పుడు చైనా ఫీల్డ్ హాస్పిటళ్లు, ట్రూపుల అకామడేషన్ నిర్వహించిన చోటుకు ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానం ఉన్నది. ఇప్పుడు కొత్తగా చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ ఈ చోటుకు దక్షిణం వైపున ఉన్నది. ఈ బ్రిడ్జీ నిర్మాణం మరోసారి ఉభయ దేశాల మధ్య మంట రాజేసేలా ఉన్నది. చైనాతో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సరిహద్దుపై చైనాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చైనా దానికదిగా తన సరిహద్దును వేరుగా గుర్తించుకుంటున్నది. భారత భూభాగాలను కొంత మేర తనలో కలుపుకుని తన సరిహద్దుగా గుర్తిస్తున్నది. దీన్ని భారత్ ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu