ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విధ్వంసం.. 4 సెల్ టవర్లు, పలు వాహనాలకు నిప్పు.. రేపు బంద్‌కు పిలుపు..

By Sumanth KanukulaFirst Published Nov 21, 2022, 12:22 PM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. కాంకేర్ జిల్లాలో వేర్వేరు చోట్ల మావోయిస్టులు మూడు వాహనాలు, రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన రెండు యంత్రాలు, నాలుగు మొబైల్ టవర్‌లను తగులబెట్టారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. కాంకేర్ జిల్లాలో వేర్వేరు చోట్ల మావోయిస్టులు మూడు వాహనాలు, రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన రెండు యంత్రాలు, నాలుగు మొబైల్ టవర్‌లను తగులబెట్టారని పోలీసులు సోమవారం తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున వేర్వేరు ప్రదేశాలలో జరిగిన సంఘటనలలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని కంకేర్ పోలీసు సూపరింటెండెంట్ శలభ్ సిన్హా చెప్పారు.

ఈ ఘటనలు చోటుచేసుకున్న అంటఘర్ ప్రాంతంలోని చాలా ప్రదేశాలలో మావోయిస్టులు బ్యానర్‌లు, పోస్టర్‌లను ఉంచారు. గత నెలలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు నేతల మరణానికి నిరసనగా మంగళవారం రోజుకు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ బ్యానర్‌లు, పోస్టర్లు ఉంచారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) కింద మర్కనార్ గ్రామం సమీపంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న  గ్రేడర్ పరికరాలు, ట్రక్కు, ట్రాక్టర్‌ను మావోయిస్టులు తగులబెట్టారు. కోయలిబేడ పట్టణంలో ఖాళీ బస్సుకు నిప్పు పెట్టారు. జిరామ్ తరాయి, సిర్సంగి, బద్రంగి, పర్‌కోట్ విలేజ్-45లో మొబైల్ టవర్‌లకు నిప్పంటించడంతో.. టవర్‌ల దిగువన ఉంచిన పెద్ద బ్యాటరీలు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు.

కోయలిబేడ-మర్దా రహదారి, అంతగఢ్-నారాయణపూర్ రాష్ట్ర రహదారిని కూడా మావోయిస్టులు అడ్డుకున్నారని.. ఆ మార్గాల్లో చెట్లను రోడ్డుకు అడ్డంగా ఉంచారని చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా  ఉంచి చెట్లను తొలగించారు. 

click me!