
BJP national president JP Nadda: ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం.. పనులు కొనసాగుతున్న అనేక ప్రాజెక్టులను నిలిపివేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలు 'కుటుంబ పార్టీలు' అని ఆరోపించారు. బీజేపీ తన భావజాలంతో దేశంలో రాజవంశ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నదని పేర్కొన్నారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో తన తొలి పర్యటనలో ఉన్న జేపీ నడ్డా.. ప్రధాని నరేంద్ర మోడీ సందేశాలను బూత్ స్థాయికి తీసుకెళ్లాలనీ, ఆయన నాయకత్వంలో జరుగుతున్న పనులను ప్రజలకు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
“ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న అనేక అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేసింది. వారు (కాంగ్రెస్ ప్రభుత్వం) సమాజ అభివృద్ధిని ఎప్పుడూ కోరుకోరు. కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మారి ఛత్తీస్ గఢ్ పేద ప్రజలను లూటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఖజానా నింపుతున్నదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా కొనసాగించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఏమీ మేలు జరగలేదని ఆరోపించిన ఆయన, ప్రజలకు సేవ చేయాలనే సిద్ధాంతం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. "మా పోరాటం 'వంశ్‌వాద్' (రాజవంశం) రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు మేము దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (NC), PDP (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ), పంజాబ్‌లో SAD (శిరోమణి అకాలీదళ్), ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (SP), బీహార్‌లో RJD రాష్ట్రీయ జనతాదళ్, BJD (ఒడిశాలో బిజూ జనతాదళ్, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్) 'అత్త-మేనల్లుడు'-- మమతా బెనర్జీ-అభిషేక్‌ల పార్టీలకు వ్యతిరేకంగా అని పేర్కొన్నారు.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి పార్టీపై (వైఎస్‌ఆర్ కాంగ్రెస్), తెలంగాణలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి), తమిళనాడులో ఎంకె స్టాలిన్ పార్టీ (ఎఐఎడిఎంకె)పై పోరాటం కొనసాగుతున్నదని అన్నారు. ఈ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని ఆరోపించారు. కుటుంబం కారణంగా ఉద్ధవ్ థాక్రే శివసేన విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. “తన ఇంటిని సక్రమంగా ఉంచుకోవడంలో విఫలమైన వారు భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. గత 50 ఏళ్లుగా మీతో అనుబంధం ఉన్నవారు పార్టీని ఎందుకు విడిచిపెట్టారో అర్థం చేసుకోవాలి అంటూ విమర్శలు గుప్పించారు. కాగా, వచ్చే ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా పర్యటన కీలకమని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
శనివారం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్ఫూర్తితో వివిధ సంస్థల ఆఫీస్ బేరర్ల మూడు రోజుల 'అఖిల్ భారతీయ సమన్వయ్ బైఠక్' (జాతీయ సమన్వయ సమావేశం)లో నడ్డా పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు జరగనున్న సమన్వయ సమావేశానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, దాని 'సర్కార్యవా' (ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబాలే ఇప్పటికే రాయ్‌పూర్ చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ సమావేశం జరగడం ఇదే తొలిసారి.